ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్‌ కీలక నిర్ణయం

28 Nov, 2021 18:42 IST|Sakshi

ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాను కొద్ది రోజుల క్రితం టాటా సన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తేలిసిందే. టాటా సన్స్‌కు దీనితో పాటు విస్తారా, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలలో వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా ఇండియా విషయంలో టాటా సన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియాఎక్స్‌ప్రెస్‌ను తమకు 84 శాతం వాటా కలిగిన ఎయిర్ ఆసియా ఇండియాతో విలీనం చేయాలని టాటా సన్స్ చూస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునే సమయం దగ్గర పడటంతో కార్యాచరణ ఖర్చులను తగ్గించాలని చూస్తోంది. విస్తారా, ఎయిర్ ఇండియాను కలిపి వేయడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఎ)తో టాటా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. విస్తారాలో టాటాకు 51శాతం వాటం ఉండగా, మిగతా వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉంది. మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్‌ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్‌ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.  

సిబ్బంది ఏకీకరణ, విమానాల నాణ్యత, భద్రతా తనిఖీల గురించి చర్చించడానికి టాటా సన్స్ కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా సీనియర్ మేనేజ్ మెంట్ తో అనేక సమావేశాలు నిర్వహించింది. ఒకే విధంగా కార్యకలాపాలు కొనసాగించే సంస్థలను విలీనం చేయడం వల్ల ఇబ్బందులు రావని, పైగా వ్యయాలు తగ్గుతాయని టాటా సన్స్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా ఇండియాలు రెండూ చౌక విమానయాన సంస్థలే. యాజమాన్య వాటాల దృష్ట్యా చూసినా, వీటిని ఒకే సంస్థగా మార్చడం టాటా సన్స్‌కు సులభమే అని నిపుణులు చెబుతున్నారు.  

(చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి 4 రోజులే పని..!)

మరిన్ని వార్తలు