విశాఖ ఉక్కుపై టాటా స్టీల్‌ కన్ను

18 Aug, 2021 04:49 IST|Sakshi

సీఈవో టీవీ నరేంద్రన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ ఆసక్తిగా ఉంది. లాంగ్‌ ప్రోడక్ట్‌ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని నరేంద్రన్‌ వివరించారు. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని ఆయన తెలిపారు.

విశాఖ ఉక్కులో 100 శాతం వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం లావాదేవీ సలహాదారుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా కేంద్రంగా ఉన్న నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ (ఎన్‌ఐఎన్‌ఎల్‌) కొనుగోలు కోసం కూడా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) దాఖలు చేసినట్లు నరేంద్రన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు