ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్‌!

1 Nov, 2022 22:16 IST|Sakshi

న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వ్యయాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ షాకిచ్చాయి. ఈ సారి నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఏకంగా 90 శాతం క్షీణించి, రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 12,548 కోట్లు. తాజాగా జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 60,658 కోట్ల నుంచి రూ. 60,207 కోట్లకు తగ్గింది.

వ్యయాలు రూ. 47,240 కోట్ల నుంచి రూ. 57,684 కోట్లకు పెరిగాయి. కీలక ఎకానమీల్లో మందగమన భయాలు, సీజనల్‌ అంశాలతో పాటు భౌగోళికరాజకీయ అనిశ్చితి తదితర అంశాలు వ్యాపార నిర్వహణలో ఒడిదుడుకులకు కారణమయ్యా యని టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ దేశీ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి సరుకుల నిల్వలను ఉపయోగించుకోవాల్సి రావడం వల్ల మార్జిన్లు తగ్గాయని టాటా స్టీల్‌ ఈడీ కౌశిక్‌ ఛటర్జీ చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్‌ కోలుకుంటూ ఉండటం, ముడి సరుకుల రేట్లు సానుకూలంగా మారుతుండటం వంటి అంశాలతో మార్జిన్లు మళ్లీ మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

మరిన్ని వార్తలు