క్యూ4 ఫలితాలు విడుదల, లాభాల్లో టాటా స్టీల్‌!

4 May, 2022 10:29 IST|Sakshi

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ గత ఆర్థిక సంవత్సరం (2021–22) మార్చితో అంతమైన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 37 శాతం వృద్ధి చెందిన రూ.9,835 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం వరకు పెరిగి రూ.69,616 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2020–21) చివరి త్రైమాసికంలో లాభం రూ.7,162 కోట్లు, ఆదాయం రూ.50,300 కోట్లుగా ఉండడం గమనార్హం. 

వ్యయాలు సైతం రూ.40,103 కోట్ల నుంచి రూ.57,636 కోట్లకు ఎగిశాయి. కరోనా, భౌగోళిక ఉద్రిక్తతల వాతావరణంలోనూ టాటా స్టీల్‌ బలమైన పనితీరు చూపించినట్టు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. కస్టమర్లతో సంబంధాలు, పంపిణీ నెట్‌వర్క్‌పై దృష్టి సారించడంతో భారత్‌లో వ్యాపారం అన్ని రకాలుగా వృద్ధిని చూసినట్టు తెలిపారు. యూరోప్‌ వ్యాపారం కూడా బలమైన పనితీరునే ప్రదర్శించినట్టు చెప్పారు.

 భారత వ్యాపారం ఎబిట్డా రూ.28,863 కోట్లుగా ఉంటే, యూరోప్‌ వ్యాపారం ఎబిట్డా రూ.12,164 కోట్లుగా ఉందని టాటా స్టీల్‌ ఈడీ, సీఎఫ్‌వో కౌషిక్‌ ఛటర్జీ వెల్లడించారు. ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో రూ.51 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. అలాగే, రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా విభజించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు