టాటా స్టీల్‌ టర్న్‌అరౌండ్‌

6 May, 2021 01:10 IST|Sakshi

క్యూ4లో రూ. 7,162 కోట్ల నికర లాభం

షేరుకి రూ. 25 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మెటల్‌ రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా స్టీల్‌ గతేడాది(2020–21) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో టర్న్‌అరౌండ్‌ అయ్యింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 7,162 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,615 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,323 కోట్ల నుంచి రూ. 50,250 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 35,432 కోట్ల నుంచి రూ. 40,052 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.

రికార్డ్‌ ఇబిటా: తొలి అర్ధభాగంలో కోవిడ్‌–19 ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థం నుంచి దేశీయంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు.. ఆర్థిక రికవరీ ప్రారంభంకావడంతో స్టీల్‌ వినియోగం పెరిగినట్లు టాటా స్టీల్‌ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. దీంతో పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు తెలియజేశారు. క్యూ4లో ముడిస్టీల్‌ ఉత్పత్తి 4.75 మిలియన్‌ టన్నులకు చేరి రికార్డును సృష్టించగా.. అమ్మకాలు 16 శాతం పెరిగి 4.67 మిలియన్‌ టన్నులను తాకినట్లు టాటా స్టీల్‌ పేర్కొంది.

క్యూ4లో ఇబిటా 40 శాతం వృద్ధితో రూ. 12,295 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 14,290 కోట్ల ఇబిటాను సాధించినట్లు వెల్లడించింది. మార్జిన్లు 40.9 శాతంగా నమోదయ్యాయి. పెట్టుబడి వ్యయాల తదుపరి రూ. 8,800 కోట్ల ఫ్రీక్యాష్‌ ఫ్లోను సాధించినట్లు నరేంద్రన్‌ తెలియజేశారు. పూర్తి ఏడాదికి క్యాష్‌ఫ్లో రూ. 24,000 కోట్లకు చేరగా.. రూ. 28,000 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. వెరసి మొత్తం రుణ భారం 28 శాతం తగ్గి రూ. 75,389 కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు.

టాటా స్టీల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,071 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు