షాకింగ్‌ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్‌ ఈవీ, స్పందించిన సంస్థ

23 Jun, 2022 14:57 IST|Sakshi

సాక్షి,ముంబై: కాలుష్య భూతాన్ని నిలువరించే లక్ష్యంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్  బైక్స్‌ మంటల్లో చిక్కుకోవడంతో ఈ వాహనాల భద్రతపై అనుమానాలు వెల్లువెత్తాయి. తాజాగా ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురి కావడం టాటా నెక్సాన్‌ లవర్స్‌ని షాక్‌కు గురిచేసింది. ఇపుడిక ఫోర్‌ వీలర్ల (ఈవీ) భద్రతపై చర్చకు తెర లేచింది. ఇప్పటివరకు ఈవాహనాల అగ్నిప్రమాదాలు టూవీలర్లకే పరిమితమైనా, టాప్‌ సెల్లర్‌ కారు టాటా నెక్సాన్‌కు సంబంధిం తొలి సంఘటన  నమోదు కావడంతో మరింత ఆందోళన నెలకొంది.

టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్‌ ప్రజాదరణ పొందిన  కారు నెక్సాన్ ఈవీ ప్రమాదానికి గురైంది. ఈ కారులో ఉన్నట్టుండి మంటలంటు కున్నాయి.  ఒక్కసారిగా ఎగిసిన  మంటలతో  కారు దాదాపు పూర్తిగా దగ్ధమైపోయింది.  ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు  ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అటు మంటలు చెలరేగిన నెక్సాన్ఈవీ యజమాని ఇప్పటికే టాటా మోటార్స్‌తో సహకరించడానికి అంగీకరించారు.  కారును ఇప్పటికే కంపెనీకి అప్పగించగా, దీన్ని  పూణేలోని టాటా ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి  తరలించనున్నారు.

మరోవైపు దీనిపై టాటా గ్రూపు స్పందించింది. నెక్సాన్‌ అగ్నిప్రమాదం  ఘటనపై  దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించింది టాటా మోటార్స్‌. ప్రస్తుతం వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందనీ ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించిన  తర్వాత పూర్తి ప్రకటన చేస్తామని టాటా ప్రతినిధి తెలిపారు. 2020లో లాంచ్‌ చేసిన  టాటా నెక్సాన్‌ఈవీ విక్రయాలు 30 వేలకు పైగా నమోదయ్యాయి.  

కాగా ఓలా, ప్యూర్ఈవీ తదితర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు