ఇక టాటా యూపీఐ..!

19 Mar, 2022 01:32 IST|Sakshi

అనుమతుల కోసం ఎన్‌పీసీఐకి దరఖాస్తు

ప్రైవేట్‌ బ్యాంకులతో చర్చలు

వచ్చే నెలలోనే సర్వీసుల ప్రారంభానికి అవకాశం

బెంగళూరు:  పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ .. డిజిటల్‌ వ్యాపార వ్యూహాల అమల్లో దూకుడు పెంచుతోంది. తాజాగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తోంది.  థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ అప్లికేషన్‌ ప్రొవైడరుగా డిజిటల్‌ చెల్లింపు సేవలు అందించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి టాటా గ్రూప్‌ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. యూపీఐ సేవలకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం ఒక ప్రైవేట్‌ బ్యాంకుతో, టాటా గ్రూప్‌లో భాగమైన టాటా డిజిటల్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో బ్యాంకింగ్‌ భాగస్వామితో కూడా భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో టాటా యూపీఐ యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి.  

టాటాకు ప్రయోజనకరం ..
ఆన్‌లైన్‌ కామర్స్‌లో విస్తరించాలనుకుంటున్న టాటా గ్రూప్‌నకు సొంత యూపీఐ యాప్‌ ఉంటే సహజంగానే ఉపయోగకరంగా ఉండనుంది. వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా తన సొంత యూపీఐ సర్వీసుల ద్వారా యూజర్లకు క్యాష్‌బ్యాక్, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందిస్తుండటం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. 

టాటా డిజిటల్‌ తమ టాటా న్యూ సూపర్‌యాప్‌ను వచ్చే నెల ప్రారంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందర్భంగా ఆవిష్కరించాలని ప్రణాళికలు వేసుకుంది. దానితో పాటే యూపీఐ యాప్‌ కూడా అందుబాటులోకి వస్తే సూపర్‌యాప్‌ లావాదేవీలు మరింత సులభతరం కాగలవని సంస్థ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్‌ పేమెంట్‌ గేట్‌వే సహా పలు ఆర్థిక సాధనాలు అందించే క్రమంలో టాటా ఫిన్‌టెక్‌ పేరుతో టాటా డిజిటల్‌ కొత్తగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ప్లేస్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  

గూగుల్‌పే, ఫోన్‌పేకు పోటీ..
ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం యూపీఐ ద్వారా ఫిబ్రవరిలో 452 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయి. సాధారణంగా ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి నాన్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు .. యూపీఐ కార్యకలాపాల కోసం వివిధ బ్యాంకులతో చేతులు కలపాల్సి ఉంటుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో భాగస్వామ్యం ద్వారా గూగుల్‌ పే.. యూపీఐ సర్వీసులు అందిస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ ప్రధానమైనవి కావడంతో యూపీఐ విధానంలో బ్యాంకుల యాప్‌లతో పోలిస్తే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఉదాహరణకు ఫోన్‌పే, గూగుల్‌పేకు యూపీఐ లావాదేవీల్లో సింహభాగం వాటా ఉంటోంది. అమెజాన్‌ పే, పేటీఎం, ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ పే వంటివి కూడా వినియోగంలో ఉన్నాయి. టాటా కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు