ఉద్యోగాలు మారడాన్ని బట్టి పన్ను మినహాయింపు ఉంటుందా?

11 Oct, 2021 10:53 IST|Sakshi

నేను 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారాను. మొదటి యజమాని దగ్గర 7 నెలలు, రెండో యజమాని దగ్గర 5 నెలలు పని చేశాను. ఇద్దరూ ఫారం 16 జారీ చేశారు. ఇద్దరూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ మినహాయింపు ఇచ్చారు. కానీ రిటర్ను నింపేటప్పుడు ఒక స్టాండర్డ్‌ డిడక్షన్‌ మాత్రమే చూపించాలంటున్నారు. ఇది కరెక్టేనా? – ఎ. సూర్యప్రకాశ్, హైదరాబాద్‌ 
మీరు అడిగిన ప్రశ్నకి మీ వయస్సుతో సంబంధం లేదు కానీ సాధారణంగా, వయస్సును బట్టి పన్నుభారం మారుతుంది. ఇక మీ సంశయానికి జవాబు ఏమిటంటే, ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలంలో ఎన్న  ఉద్యోగాలు చేసినా, మారినా, ఆ ఉద్యోగికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఒక్కసారే .. ఒక మొత్తమే తగ్గించాలి. ఇది ఉద్యోగికి వర్తించే మినహాయింపే తప్ప యజమానులకు సంబంధించినది కాదు. రెండో యజమాని ఫారం 16 జారీ చేసేటప్పుడు, అంతకన్నా ముందు యజమాని ఇచ్చిన ఫారం 16ని చూడాలి. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ విషయంలోనూ ఇలాగే జరిగి ఉంటే రెండో యజమాని ఆ తప్పు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. మీకు మొత్తం మీద రూ. 50,000 మాత్రమే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రూ. 50,000 తగ్గింపు ఇవ్వరు. ఒకసారి మాత్రమే చూపించడం, క్లెయిం చేయడం కరెక్టు పని. ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేసినప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగవు.


నా వయస్సు 52 సంవత్సరాలు. నేను టీచర్‌ని. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. తను కూడా టీచరే. భువనగిరిలో చెరొక స్కూలులో పని చేస్తున్నాం. ఇది మా స్వస్థలం. మా నాన్నగారు (లేరు) కట్టించిన ఇంట్లో కలిసి కాపురం చేస్తున్నాం. అమ్మ మాతో ఉంటోంది. ఇంటద్దె క్లెయిం చేయవచ్చా? 
మీ ఇద్దరికీ వచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సు, ఇతరాలు మొదలైనవి ఉంటాయి. నిజంగా మీరు ప్రతినెలా అద్దె చెల్లించినట్లయితే, అలా చెల్లించినందుకు మీ ఆదాయపు లెక్కింపులో అర్హత ఉన్నంత మేరకు మినహాయింపుగా తగ్గిస్తారు. అలా తగ్గించినందు వలన ఆదాయం తగ్గి, పన్ను భారం తగ్గుతుంది. భార్యభర్తలు కలిసి ఒకే గూటి కింద కాపురం.. ఇద్దరూ అద్దె చెల్లించే ఉంటున్నారా? మీరు ఆ ఇంట్లో ఉంటున్నాం అంటున్నారు. అద్దె ఇవ్వడం లేదు. కాబట్టి మీ ఆదాయంలో నుంచి ఇంటద్దె అలవెన్స్‌కి క్లెయిం .. అంటే మినహాయింపు పొందకూడదు. ఇది సబబు కాదు. అయితే, ఒక విధంగా ప్లానింగ్‌ చేసుకోవచ్చు. మీ నాన్నగారు కట్టించిన ఆ ఇంటికి వారసులెవ్వరు? మీ అమ్మగారు అనుకుందాం. అంటే మీ అమ్మగారు ఇంటి ఓనరు. ఆవిడ ఇంట్లో మీరు అద్దెకు ఉంటున్నట్లు చెప్పవచ్చు. మీ ఇద్దరిలో ఎవరి జీతం ఎక్కువో వారికి ఈ ప్లానింగ్‌ బాగుంటుంది. ఇద్దరి జీతం ఇంచుమించు సమానంగా ఉంటే ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు. అద్దె నెలకు రూ. 10,000 అనుకోండి. చెరి సగం మీ అమ్మగారికి ఇవ్వండి. పూర్తి బెనిఫిట్‌ రావడానికి తగినంతగా అద్దెను లెక్కించండి. మీ అమ్మగారి పాన్‌ తీసుకోండి. బ్యాంకు అకౌంటు తెరవండి. ఆ అకౌంటులో తూ.చా. తప్పకుండా ప్రతి నెలా అద్దెలు విడివిడిగా జమ చేయండి. ఇలా చేయడం వల్ల వ్యవహారానికి చట్టరీత్యా బలం ఏర్పడుతుంది. ఓనర్, అద్దె, బ్యాంకు ద్వారా చెల్లింపు, పాన్, ఇలా ఇవన్నీ గట్టి రుజువులే. 60 ఏళ్ల లోపు వారికైతే నెలసరి అద్దె రూ. 20,000 దాటితే తప్ప (మీ అమ్మగారికి ఇతరత్రా ఏ ఆదాయం లేదనుకుందాం), 60 సంవత్సరాలు దాటితే రూ. 25,000 వరకూ ఏ పన్ను భారం ఉండదు. మీరే ఆ ఇంటికి ఓనర్‌ అయితే ఇలా చేయవద్దు. మీరిద్దరూ మీ మొత్తం ఆదాయంలో ఇంటద్దె అలవెన్స్‌ని మినహాయింపుగా పొందవద్దు. తప్పుగా క్లెయిం చేసి ఎటువంటి కష్టాలు కొని తెచ్చుకోకండి. 
 

- కేసీహెచ్‌ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు

చదవండి : రాబడులు, రక్షణ ఒకే పథకంలో..

మరిన్ని వార్తలు