ఐటీఆర్‌ ఫైలింగ్‌: కొత్త టెక్నాలజీ

6 Apr, 2021 08:11 IST|Sakshi

ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో అందుబాటు 

జావాస్క్రిప్ట్‌ ఆబ్జెక్ట్‌ నొటేషన్‌ (జేఎస్‌వోఎన్‌) అనే నూతన టెక్నాలజీ లాంచ్‌

 సాక్షి,  న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల పత్రాలైన ఐటీఆర్‌1, 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్‌లైన్‌ యుటిలిటీని ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. ఈఫైలింగ్‌ పోర్టల్‌లో ఈ ఆఫ్‌లైన్‌ యుటిలిటీ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. జావాస్క్రిప్ట్‌ ఆబ్జెక్ట్‌ నొటేషన్‌ (జేఎస్‌వోఎన్‌) అనే నూతన టెక్నాలజీ ఆధారితంగా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ‘‘విండోస్‌ 7, ఆ తర్వాతి వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన కంప్యూటర్లలో ఆఫ్‌లైన్‌ యుటిలిటీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4కు మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఐటీఈఆర్‌లను తర్వాత జోడించడం జరుగుతుంది’’ అంటూ ఆదాయపన్ను శాఖా ప్రకటించింది.

ఆదాయపన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ నుంచి ముందుగా నింపిన డేటా ఆధారిత రిటర్నులను డౌన్‌లోడ్‌ చేసుకుని, మిగిలిన డేటాను నింపిన అనంతరం దాఖలు చేయవచ్చు. ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో ఐటీఆర్‌ అప్‌లోడ్‌ చేసేందుకు ఇంకా అనుమతించనందున.. ఐటీఆర్‌ను పూర్తిగా నింపి ఆఫ్‌లైన్‌ యుటిలిటీలో సేవ్‌ చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖా తెలిపింది. నూతన యుటిలిటీ అన్నది రిటర్నుల దాఖలు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని నాంజియా ఆండర్సన్‌ ఇండియా డైరెక్టర్‌ నేహా మల్హోత్రా పేర్కొన్నారు.   

సాధారణ బీమా సంస్థలకు కొత్త నిబంధనలు 
న్యూఢిల్లీ:  పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సాధారణ బీమా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరలకు సంబంధించి ముసాయిదా నిబంధనలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) విడుదల చేసింది.ముఖ్యంగా బీమా పాలసీల తయారీ విషయంలో అనుసరించాల్సిన కనీస కార్యాచరణను ఇందులో నిర్దేశించింది. బీమా సంస్థల్లో సమర్థతను పెంచడం ద్వారా పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలూ ఇందులో ఉన్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అప్పుడు అన్ని సాధారణ బీమా ఉత్పత్తులు, యాడాన్‌ కవర్‌లకు ఇవి వర్తిస్తాయి.  

మరిన్ని వార్తలు