పీఎఫ్‌ డిపాజిట్‌ రూ.5 లక్షలపై పన్ను లేదు! 

24 Mar, 2021 00:17 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్

న్యూఢిల్లీ:  ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. పీఎఫ్‌ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై 5 లక్షల వరకు జమ చేసుకునే వారికి వడ్డీపై పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. 2021–22 బడ్జెట్‌లో భాగంగా.. భవిష్యనిధి ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి జమలు రూ.2.5లక్షలకు మించితే వడ్డీపై పన్ను వర్తిస్తుందంటూ మంత్రి ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక బిల్లు 2021పై చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. 127 సవరణలకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఫైనాన్స్‌ బిల్లు సభామోదం పొందింది. బుధవారం ఇది రాజ్యసభ ముందుకు రానుంది. 

జీఎస్‌టీ కిందకు పెట్రోల్, డీజిల్‌పై చర్చకు సిద్ధం 
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తులను తీసుకురావాలన్న ప్రతిపాదనపై తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రకటించారు. కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాల పన్నుల వాటాయే పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో అధిక శాతంగా ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్‌ రిటైల్‌ ధరలో 60 శాతం, డీజిల్‌ విక్రయ ధరలో 53 శాతం పన్నులే. కేంద్రం, రాష్ట్రాలు రెండూ పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధిస్తున్నాయని మంత్రి పేర్కొంటూ.. అయినప్పటికీ కేంద్రం వసూలు చేసిన పన్నులను రాష్ట్రాలతో పంచుకుంటున్నట్టు చెప్పారు. తదుపరి జీఎస్‌టీ సమావేశంలో రాష్ట్రాలు ఈ ప్రతిపాదనతో ముందుకు వస్తే చర్చించేందుకు సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు.‌  

మరిన్ని వార్తలు