పీఎఫ్‌ పన్ను.. ప్రైవేట్‌ ఉద్యోగులకూ గుడ్‌న్యూస్‌ చెప్పనున్న కేంద్రం!

22 Jan, 2022 20:35 IST|Sakshi

పన్ను రహిత ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్‌ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్‌ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్‌ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే..


ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్‌ ట్యాక్స్‌ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది.  జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్‌ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి.  

2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. 

అయితే  పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు.  ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే..  జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి.  ప్రాథమికంగా ఈ నిబంధన..  ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి.

చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. 

మరిన్ని వార్తలు