నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు

26 Jul, 2021 00:49 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు.

ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్‌లైన్‌ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్‌ కూడా అభినందించారు.

మరిన్ని వార్తలు