గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్‌.. కీలక బాధ్యతలపై చర్చలు!

22 Mar, 2023 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల బ్లూచిప్‌ కంపెనీ టీసీఎస్‌ను త్వరలో వీడనున్న ప్రస్తుత ఎండీ, సీఈవో రాజేష్‌ గోపీనాథన్‌ తదుపరి కంపెనీకి సలహాదారుగా సేవలందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోపీనాథన్‌ టీసీఎస్‌ నుంచి తప్పుకోనున్నారు. అయితే డైవర్సిఫైడ్‌ దిగ్గజ గ్రూప్‌ టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మరికొంతకాలంపాటు గోపీనాథన్‌ సేవలను వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: హౌసింగ్‌ బూమ్‌..  బడ్జెట్‌ ఇళ్లకు బాగా డిమాండ్‌

ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గోపీనాథన్‌తో చంద్రశేఖరన్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశాలపై టాటా సన్స్, టీసీఎస్‌ స్పందించడానికి నిరాకరించాయి. విభిన్న టెక్నాలజీ విభాగాల(డొమైన్స్‌)లోకి విస్తరిస్తున్న టీసీఎస్‌కు నమ్మకమైన, అనుభవజ్ఞులైన వ్యక్తుల ఆవశ్యకత ఉన్నట్లు టాటా గ్రూప్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి సెప్టెంబర్‌ 15 తదుపరి గోపీనాథన్‌ను టీసీఎస్‌కు సలహాదారు(అడ్వయిజరీ) పాత్రలో వినియోగించుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: గేమింగ్‌ హబ్‌గా భారత్‌.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన

కాగా.. ఇలాంటి ప్రణాళికలేవీ లేవని గోపీనాథన్‌ విలేకరుల సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం! గోపీనాథన్, చంద్రశేఖరన్‌ రెండున్నర దశాబ్దాలపాటు కలసి పనిచేశారు. ఈ కాలంలో టీసీఎస్‌ వృద్ధికి గోపీనాథన్‌ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన హయాంలో కంపెనీ 10 బిలియన్‌ డాలర్ల(రూ. 82,600 కోట్లు) ఆదాయాన్ని జత చేసుకుంది. కంపెనీ మార్కెట్‌ విలువకు సైతం 70 బిలియన్‌ డాలర్లు జమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో కంపెనీ నికర లాభం రూ. 10,846 కోట్ల మైలురాయికి చేరిన సంగతి తెలిసిందే!

మరిన్ని వార్తలు