టీసీఎస్‌కు షాక్‌! సీఈవో గోపీనాథన్‌ గుడ్‌బై!

17 Mar, 2023 06:08 IST|Sakshi
రాజేశ్‌ గోపీనాథన్, కృతివాసన్‌

సీఈవో పదవికి రాజేశ్‌ గోపీనాథన్‌ గుడ్‌బై

కొత్త సీఈవోగా కృతివాసన్‌

న్యూఢిల్లీ: టీసీఎస్‌ ఎండీ, సీఈవో రాజేశ్‌ గోపీనాథన్‌ అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో నూతన సీఈవోగా (డిజిగ్నేట్‌) బీఎఫ్‌ఎస్‌ఐ డివిజన్‌ గ్లోబల్‌ హెడ్‌గా ఉన్న కె.కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు గోపీనాథన్‌ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలు సాఫీగా బదిలీ అయ్యేందుకు నూతన సారథికి సహకారం అందిస్తారని టీసీఎస్‌ ప్రకటించింది.

కృతివాసన్‌కు టీసీఎస్‌తో 34 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. 1989 నుంచి ఆయన టీసీఎస్‌తోనే కలసి పనిచేస్తున్నారు. తన కెరీర్‌లో కృతివాసన్‌ డెలివరీ, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ తదితర బాధ్యతల్లో పనిచేసినట్టు టీసీఎస్‌ తెలిపింది. టీసీఎస్‌ ఎండీ, సీఈవోగా ఉన్న ఎన్‌ చంద్రశేఖరన్‌ టాటా గ్రూపు చైర్మన్‌గా పదోన్నతి పొందడంతో.. సీఎఫ్‌వోగా ఉన్న రాజేశ్‌ గోపీనాథన్‌ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లుగా సంస్థకు ఎండీ, సీఈవోగా సేవలు అందించారు. టీసీఎస్‌లో 22 ఏళ్లుగా గోపీనాథన్‌ పనిచేస్తున్నారు. (గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్‌: లేదంటే తప్పదు మూల్యం!)

‘‘టీసీఎస్‌లో నా 22 ఏళ్ల ఉద్యోగ మజిలీని ఎంతో ఆస్వాదించాను. చంద్రతో సన్నిహితంగా కలసి పనిచేయడం పట్ల ఆనందంగా ఉంది. నా ఈ మొత్తం ప్రయాణానికి ఆయన మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఈ దిగ్గజ సంస్థకు గడిచిన ఆరేళ్లుగా నాయకత్వం వహించడం పట్ల సంతృప్తికరంగా ఉంది. ఈ కాలంలో అదనంగా 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 70 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ తోడయింది’’అని గోపీనాథన్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఆసక్తులకు సమయం కేటాయించేందుకు ఇదే సరైన సమయమని భావించి తప్పుకుంటున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు