స్ఫూర్తిదాయకం! టీసీఎస్‌ ఉద్యోగుల సరికొత్త రికార్డ్‌..

18 Jun, 2023 16:49 IST|Sakshi

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్‌లు  కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్‌ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 

22 లక్షల గంటలు
టీసీఎస్‌ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్‌ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది.

హోప్‌ చొరవలో భాగంగా టీసీఎస్‌ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు.

సేవా కార్యక్రమాలు ఇవే..
సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్‌లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్‌లను టీసీఎస్‌ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్‌ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు!

మరిన్ని వార్తలు