నిరుద్యోగులకు ఐటీ దిగ్గ‌జం టీసీఎస్ గుడ్‌న్యూస్‌..!

9 Jul, 2021 20:54 IST|Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని క్యాంప‌స్‌ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెష‌ర్స్‌ను నియ‌మించుకోనుంది. గత ఏడాది 40,000 మందిని నియమించుకున్న కంపెనీ తాజాగా మ‌రింత మందిని నియ‌మించుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ ల‌క్క‌డ్ శుక్ర‌వారం వెల్ల‌డించారు. భార‌త్‌లో నైపుణ్యాల‌కు కొద‌వ‌లేద‌ని, ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా అద్భుత నైపుణ్యాల‌తో కూడిన మాన‌వ‌ వ‌న‌రులు భార‌త్‌లో ఉన్నట్లు టీసీఎస్ సీఓఓ ఎన్‌జీ సుబ్ర‌హ్మ‌ణ్యం పేర్కొన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షలు వల్ల ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగదు అని ఆయన అన్నారు. గత ఏడాది మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరు అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా, గత ఏడాది అమెరికన్ క్యాంప‌స్‌ల నుంచి 2,000 మంది ఫ్రెష‌ర్స్‌ నియమించికున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో ప్రతిభకు కొరత లేదని, భార‌త్‌లో టెకీల వేత‌నాలు హేతుబద్ధంగా ఉన్నాయ‌ని, అందుకే దేశీ ట్యాలెంట్‌పై గ్లోబ‌ల్ కంపెనీలు దృష్టిసారించాయ‌ని ఎన్‌జీ సుబ్రమణ్యం తెలిపారు. భారతీయల ప్రతిభ "అసాధారణమైనది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 20,409 నిమయించుకున్నట్లు తెలిపింది. దీంతో దేశంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగుల కలిగిన అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించింది.

మరిన్ని వార్తలు