ఫ్రెషర్లకు టీసీఎస్ భారీ శుభవార్త!

8 Oct, 2021 21:11 IST|Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 35,000 మంది గ్రాడ్యుయేట్లను కొత్తగా నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 నియమించుకొనున్నట్లు తెలిపింది. కంపెనీ ఇప్పటికే గత ఆరు నెలల్లో 43,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. టీసీఎస్ క్యూ2లో నికర ప్రాతిపదికన 19,690 మంది ఉద్యోగులను నియమించుకుంది. సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరుకుంది.(చదవండి: మీ ఆండ్రాయిడ్, యాపిల్‌ ఫోన్ పోయిందా? ఇదిగో ఇలా చేయండి)

ఈ ఉద్యోగుల మొత్తం సంఖ్యలో 36.2% మహిళ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస సమస్య) సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9%కి పెరిగింది. ఇది గత త్రైమాసికంలో 8.6%గా ఉంది. ప్రస్తుత అట్రిషన్ స్థాయిల గురించి ఆందోళన చెందుతున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ధోరణి రాబోయే రెండు మూడు త్రైమాసికాల వరకు కొనసాగుతుందని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఇప్పటి వరకు 70% మంది ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారని, 95% కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేసుకోవడంతో ఉద్యోగులను ఆఫీసుకు తిరిగి తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలను ఆవిష్కరిస్తుంది. పూర్తిగా టీకాలు వేసుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి ఆహ్వానించినట్లు టిసిఎస్ యాజమాన్యం తెలిపింది.
 

మరిన్ని వార్తలు