IT jobs: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్‌లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!

19 Sep, 2021 09:37 IST|Sakshi

నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఉద్యోగాల నియామకాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.  

2020 గణాంకాల ప్రకారం..కోవిడ్‌ కారణంగా ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్‌ వేవ్‌ రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా  ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ రిపోర్ట్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 
 
టెక్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ 
ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో టెక్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు ఇండీడ్‌ తెలిపింది. 400శాతం వరకు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల డిమాండ్‌ పెరిగినట్లు ఇండీడ్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది.  లింక్డ్‌ఇన్‌ జాబ్‌ కోసం అప్లయ్‌ చేస్తే టెక్‌ ఉద్యోగాలకు ఏ విధమైన డిమాండ్‌ ఉందో తెలుస్తోందని చెప్పింది. అంతేకాదు  2020లో మహమ్మారి ప్రారంభంలో పలు రంగాల్లో అనిశ్చితి నెలకొందని, జూన్ 2020లో కరోనా ఫస్ట్‌ వేవ్ గరిష్ట స్థాయికి చేరడానికి  కొన్ని నెలల ముందు ఉద్యోగుల నియామకం 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటితో పాటు  అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్,సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉన్న జాబ్స్‌కు డిమాండ్ 150-300 శాతం మధ్య పెరిగింది.  

70-120 శాతం జీతాల పెంపు
సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి.ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు..అదే స్థాయిలో కంపెనీలు  శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు.పుల్‌ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. 

ఉద్యోగులకు ఇదే మంచి సమయం 
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు దేశం అంతా టెక్ ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, మంచి ఉద్యోగం కావాలనుకునే అభ్యర్ధులకు నైపుణ్యాలు ఉంటే ఇదే మంచి సయమం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటి నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని ఇండీడ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. 

చదవండి: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం

మరిన్ని వార్తలు