బంపర్‌ఆఫర్‌: కరోనా బ్యాచ్‌లకు టీసీఎస్‌లో ఉద్యోగాలు

19 Oct, 2021 13:06 IST|Sakshi

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సంస్థ ఫ్రెషర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫ్రెష్‌ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వరంలాంటి వార్తను ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది.

కోవిడ్‌ కష్టాలు
గత రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా నామజపంతో ఉలిక్కి పడుతోంది. కోవిడ్‌ 19 కారణంగా విద్యా సంస్థలు ఎక​‍్కడివక్కడే మూత పడ్డాయి. రెగ్యులర్‌ క్లాసులు మూతపడి ఆన్‌లైన్‌ క్లాసులే వేదికయ్యాయి. జూమ్‌, గూగుల్‌ మీట్‌ తదితర యాప్‌ల ద్వారానే విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది. ప్రాక్టికల్‌ తరగతులకు అవకాశమే లేకుండా పోయింది. 

కరోనా బ్యాచ్‌లు
కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణంగా చాలా కోర్సులకు సంబంధించి సిలబస్‌లు పూర్తి కాలేదు. సిలబస్‌ పూర్తి అనిపించుకున్న సబ్జెక్టులు, చాప్టర్లు కూడా అరకొరగానే జరిగాయనే అభిప్రాయం  తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉంది. మరికొన్ని కోర్సులకు, క్లాసులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే నెక్ట్స్‌ తరగతిగా ప్రమోట్‌ అయ్యారు. దీంతో 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లకు కరోనా బ్యాచ్‌లుగా పేరు పడ్డాయి. భవిష్యత్తులో సాధారణ బ్యాచ్‌లతో పోల్చితే కరోనా బ్యాచ్‌ల పరిస్థితి ఏంటనే బెంగ చాల మందిలో నెలకొంది. 

టీసీఎస్‌ సంచలన నిర్ణయం
కరోనా బ్యాచ్‌ విద్యార్థుల సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ టీసీఎస్‌ సంస్థ సంచనల నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ హైరింగ్‌ ప్రోగ్రామ్‌ కింద  ఎంబీఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ అవకాశం ప్రత్యేకించి 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లలో పాసవుట్‌ అయిన ఎంబీఏ గ్రా‍డ్యుయేట్స్‌కే కేటాయించింది. 

నవంబరు 9 వరకు
ఉద్యోగార్థులు టీసీఎస్‌ పోర్టల్‌ ద్వారా ఎంబీఐ హైరింగ్‌లో భాగం కావచ్చు. నవంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 నుంచి 28 ఏళ్ల వరకు వయస్సు పరిమితిని విధించారు. ఉద్యోగార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడంతో పాటు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులతో పాస్‌ కావాల్సి ఉంటుంది. బీటెక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు, 

35,000ల మందికి
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వడపోసేందుకు టీసీఎస్‌ 90 నిమిషాల పరీక్షను నిర్వహించనుంది.  వెర్బల్‌ అప్టిట్యూట్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూట్‌, బిజినెస్‌ అప్టిట్యూట్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ కింద దాదాపు 35,000ల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌ని టీసీఎస్‌ హైర్‌ చేసుకోనుంది. 

చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

మరిన్ని వార్తలు