సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్

14 Apr, 2021 18:44 IST|Sakshi

భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ, ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటి కంపెనీలలో ఒకటైన టీసీఎస్ సరికొత్త రికార్డుకు చేరువలో ఉంది. టీసీఎస్ వచ్చే మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగుల గల సంస్థగా అవతరించనుంది. దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో ప్రపంచ స్థాయి ప్రతిభ గల ఉద్యోగులు ఇండియాలో కూడా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత సంవత్సరంలో 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు.

కేవలం జనవరి-మార్చి 2021 కాలంలోనే 19,388 మంది ఉద్యోగులను సంస్థ చేర్చుకుంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల ఒప్పందాలను ఇతర కంపెనీలతో కుదుర్చుకుంది. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ అమెరికా సహా పలు విదేశాలకు కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తోంది. దేశం నుంచి అత్యధిక సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తున్న ఐటీ కంపెనీగా గుర్తింపు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

నాల్గవ త్రైమాసిక ఆదాయాల విడుదల సమయంలో జర్నలిస్టులతో జరిపిన సంభాషణలో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగుల నియామకం ఎక్కువ భాగం క్యూ 1(ఏప్రిల్-జూన్), క్యూ 2(జూలై-సెప్టెంబర్)లలో జరుగుతుందని పేర్కొన్నారు. 1968లో ఏర్పాటైన టీసీఎస్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. ఐటీ సేవలతో పాటు, బిజినెస్, కన్సల్టెన్సీ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్స్ విభాగాల్లో సేవలందిస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. రికార్డు స్థాయి సాఫ్ట్ వేర్ ఎగుమతులతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జూన్ నెలాఖరునాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్ ను అధిగమించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది.

చదవండి: 

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు