TCS Q3 Results: టీసీఎస్‌ గుడ్! రూ.60,853 కోట్లకు చేరిన ఆదాయం

12 Jan, 2024 08:08 IST|Sakshi

నికర లాభం రూ. 11,735 కోట్లు 

మొత్తం ఆదాయం రూ. 60,853 కోట్లు

షేరుకి మొత్తం రూ. 27 డివిడెండ్‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో నికర లాభం 8.2 శాతం పుంజుకుని రూ. 11,735 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వృద్ధితో రూ. 60,583 కోట్లకు చేరింది. భారత్‌(23.4 శాతం)సహా వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పుంజుకోవడం ఇందుకు సహకరించింది. ఈ బాటలో ప్రధాన మార్కెట్లలో యూకే 8.1 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 16 శాతం, లాటిన్‌ అమెరికా 13.2 శాతం చొప్పున వృద్ధి సాధించగా.. ఉత్తర అమెరికా నుంచి 3 శాతం క్షీణత నమోదైంది. 

ఇక విభాగాలవారీగా చూస్తే ఎనర్జీ, రిసోర్సెస్‌ – యుటిలిటీస్‌(11.8 శాతం), తయారీ(7 శాతం), లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌(3.1 శాతం) ఆదాయానికి దన్నుగా నిలిచినట్లు కంపెనీ పేర్కొంది. అయితే కీలకమైన బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో 3 శాతం, మీడియా, టెక్నాలజీలలో 5 శాతం చొప్పున ప్రతికూల వృద్ధి నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 27 చొప్పున  డివిడెండును ప్రకటించింది. దీనిలో రూ. 18 ప్రత్యేక డివిడెండ్‌ కలసి ఉంది. ఇందుకు రికార్డ్‌ డేట్‌ ఈ నెల19కాగా.. ఫిబ్రవరి 5నుంచి చెల్లించనుంది.  

పలు ఒప్పందాలు
క్యూ3లో దిగ్గజ యూకే బ్యాంక్‌ మోటార్‌ ఫైనాన్స్, లీజింగ్‌ బిజినెస్‌లకు ఎండ్‌టు ఎండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ బాటలో ఆస్ట్రేలియా ప్రధాన ఎక్సే్ఛంజీ ఏఎస్‌ఎక్స్‌ అధునాతన క్లయరింగ్, సెటిల్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది.  యూఎస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ప్రస్తుత నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ కోసం టీసీఎస్‌తో చేతులు కలిపింది.

సాఫ్ట్‌వేర్‌ సేవలకు సీజనల్‌గా బలహీన త్రైమాసికంగా పేర్కొనే అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లోనూ కంపెనీ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించింది. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో, కస్టమర్‌ కేంద్రంగా అమలు చేసే వ్యూహాలతోపాటు.. పటిష్ట బిజినెస్‌ మోడల్‌ను ఇది ప్రతిబింబిస్తోంది. వివిధ మార్కెట్ల నుంచి కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భారీ ఆర్డర్‌ బుక్‌కు కారణమవుతోంది. - కె. కృతివాసన్, టీసీఎస్‌ సీఈఓ

ఇతర విశేషాలు... 

  • నిర్వహణ మార్జిన్లు 0.5 శాతం మెరుగుపడి 25 శాతానికి చేరాయి. నికర మార్జిన్లు 19.4 శాతంగా నమోదయ్యాయి.
  • ఆర్డర్‌ బుక్‌ 8.1 బిలియన్‌ డాలర్లను తాకింది.
  • డిసెంబర్‌ కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 10,669 మంది తగ్గి 6,03,305కు చేరింది. వీరిలో మహిళల సంఖ్య 35.7%. 
  • కార్యకలాపాల ద్వారా రూ. 11,276 కోట్ల నగదును జమ చేసుకుంది. 
  • గత 12 నెలల్లో ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 13.3 శాతంగా నమోదైంది. 

ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు బీఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ. 3,736 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు