మరో ఘనతను సాధించిన టీసీఎస్

11 Jan, 2021 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చరిత్ర సృష్టించింది. సోమవారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్ ధర 3.5 శాతం పెరిగి గరిష్ట స్థాయి 3,230 రూపాయలను తాకింది. దీంతో తొలిసారిగా టీసీఎస్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటి మరో ఘనతను తన పేరున లిఖించుకుంది. ఇంతకముందు ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం సంవత్సరానికి 7.17 శాతం పెరిగి రూ.8,727 కోట్లకు చేరుకుంది.(చదవండి: ఐటీ దన్ను: స్టాక్‌మార్కెట్‌ దూకుడు)

ట్రేడింగ్ సమయంలో టీసీఎస్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో సోమవారం తొలిసారిగా టీసీఎస్ కంపెనీ క్యాపిటలైజెషన్ వాల్యూ 12 లక్షల కోట్ల రూపాయలను దాటింది. దేశంలో 12 లక్షల కోట్ల క్యాపిటలైజెషన్ దాటిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే, ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఒక్కో షేరు ధర రూ.1,365.95, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ రూ.1,029, విప్రో రూ.444.95, మైండ్‌ట్రీ రూ.1,764.50, టెక్ మహీంద్రా రూ.1,068.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ లో వృద్ధి కనిపించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 50 0.58 శాతం లాభపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ షేర్లు 72.8 శాతం లాభపడగా, బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 108.30 శాతం లాభపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు