టీసీఎస్‌కు భారీ షాక్‌, రూ.55,471 కోట్ల నష్టం!

12 Jul, 2022 07:17 IST|Sakshi

ముంబై: ఐటీ షేర్ల పతనంతో స్టాక్‌ సూచీల మూడు రోజుల ర్యాలీకి సోమవారం అడ్డుకట్టపడింది. టీసీఎస్‌ తొలి క్యూ1 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు డాలర్‌ మారకంలో రూపాయి తాజా కనిష్టానికి దిగిరావడం ప్రతికూలాంశాలుగా మారాయి. 

నేడు  జూన్‌ ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. ఇంట్రాడేలో 437 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 87 పాయింట్ల నష్టంతో 54,395 వద్ద స్థిరపడింది. మరో సూచి నిఫ్టీ 133 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. మార్కెట్‌ ముగిసే సరికి ఐదు పాయింట్ల నష్టంతో 16,216 వద్ద నిలిచింది. 

ఐటీ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత మార్కెట్లో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకశాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.270 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 171 కోట్ల షేర్లను అమ్మేశారు. ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందుకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  

టీసీఎస్‌కు రూ.55,471 కోట్ల నష్టం  
ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కంపెనీ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా షేరు 4.64% నష్టంతో మూడు వారాల కనిష్టం రూ.3,113 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదుశాతం పతనమై 3,105 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు ఐదు శాతం క్షీణతతో రూ.55,471 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ తుడిచిపెట్టుకుపోయింది.  

టెలికం రంగ షేర్ల నష్టాల ‘ట్యూన్‌’ 
టెలికాం రంగంలో అదానీ అడుగుపెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో సంబంధింత టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ నెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌తో పాటు అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకున్నారు.

 అదానీ రాక పోటీ మరింత తీవ్రతరమవుతుందనే భయాలతో భారతీ ఎయిర్‌ టెల్‌ షేరు ఐదు శాతం నష్టపోయి రూ.660 ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో టాప్‌ లూజర్‌ ఇదే. వొడాఫోన్‌ ఐడియా షేరు మూడున్నర శాతం పెరిగి రూ.8.72 వద్ద ముగిసింది. మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ షేర్లు 20శాతం పెరిగి రూ.19.85 వద్ద నిలిచింది. అదానీ షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో 7–1% మధ్య రాణించాయి.

మరిన్ని వార్తలు