టీసీఎస్‌- విప్రో.. రికార్డ్స్‌- సెన్సెక్స్‌ జూమ్‌

8 Oct, 2020 11:24 IST|Sakshi

500 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌

షేరుకి రూ. 3,000 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌

క్యూ2లో అంచనాలను మించిన ఫలితాలు

చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన టీసీఎస్‌ షేరు

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు ప్రతిపాదన

5 శాతం జంప్‌చేసిన విప్రో లిమిటెడ్‌ షేరు

వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 501 పాయింట్లు దూసుకెళ్లి 40,380కు చేరగా.. నిఫ్టీ 137 పాయింట్లు జమ చేసుకుని 11,876 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ విప్రో లిమిటెడ్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

టీసీఎస్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో టీసీఎస్‌ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 4.8 శాతం పెరిగి రూ. 7,475 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. దీనికితోడు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌నకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 3,000 ధర మించకుండా 1.42 శాతం ఈక్విటీని బైబ్యాక్‌ చేయనున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. 5.33 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 16,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 2,878కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.7 శాతం ఎగసి రూ. 2,866 వద్ద ట్రేడవుతోంది.

విప్రో లిమిటెడ్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి ప్రతిపాదించినట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఈ నెల 13న సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2 ఫలితాలు సైతం అదేరోజు విడుదల చేసే వీలున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఐటీ బ్లూచిప్‌ కంపెనీ టీసీఎస్‌, మధ్యస్థాయి ఐటీ కంపెనీ మజెస్కో లిమిటెడ్‌ ఈక్విటీ బైబ్యాక్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో విప్రో మూడో కంపెనీగా నిలవనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 354కు చేరింది. తద్వారా రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 368 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు