నంబర్‌ పోర్టబిలిటీపై ట్రాయ్‌ ఆదేశాలు సరైనవే: టీడీశాట్‌

11 Mar, 2022 08:05 IST|Sakshi

న్యూఢిల్లీ: టారిఫ్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా యూజర్లు నంబర్‌ పోర్టబిలిటీ కోసం ఎస్‌ఎంఎస్‌ పంపించే సౌలభ్యం కల్పిస్తూ ట్రాయ్‌ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని టెలికం ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, యూజర్లు అందరికీ ఆదేశాలను అమలు చేయడానికి వొడాఫోన్‌ ఐడియాకు సముచిత సమయం ఇవ్వాలని ట్రాయ్‌కు సూచించింది. 

వేరే ఆపరేటర్‌కు మారాలనుకునే యూజర్లకు  టెలికం కంపెనీలు తప్పనిసరిగా పోర్టింగ్‌ కోసం ఎస్‌ఎంఎస్‌ను పంపే సౌలభ్యం కల్పించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ 2021 డిసెంబర్‌లో ఆదేశించింది. టారిఫ్‌ ఆఫర్లు, వోచర్లు, ప్లాన్లతో దీన్ని ముడిపెట్టరాదని సూచించింది. కొన్ని ప్లాన్లలో ఎస్‌ఎంఎస్‌ సదుపాయం లేదనే సాకుతో నిర్దిష్ట టెల్కోలు.. నంబర్‌ పోర్టబిలిటీ కోసం సంక్షిప్త సందేశాలు పంపనివ్వకుండా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వొడాఫోన్‌ ఐడియా.. టీడీశాట్‌ను ఆశ్రయించింది. 

ఒక యూజరు .. ఎస్‌ఎంఎస్‌ లేని ప్యాక్‌ను ఎంచుకున్నారంటేనే వారు పోర్టింగ్‌ హక్కులను వదులుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని వాదించింది. కానీ వీటిని టీడీశాట్‌ తోసిపుచ్చింది. అయితే, పోర్టబిలిటీ కోసం పంపే ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లను ఉచితం చేయకుండా, ఎంతో కొంత చార్జీలు వర్తింపచేసేలా ట్రాయ్‌ తగు వివరణ జారీ చేయాలని పేర్కొంది.   
చదవండి: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్‌బీఐ యోనో యాప్..!

మరిన్ని వార్తలు