ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు

11 Aug, 2023 02:26 IST|Sakshi

2023 ద్వితీయ ఆరు నెలల్లో 3 శాతం అధికం 

ఈ కామర్స్, స్టార్టప్‌లు, టెలీకంలో సానుకూలం 

ఐటీ రంగంలో భిన్నమైన పరిస్థితి  

టీమ్‌లీజ్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్‌) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ తెలిపింది. కెరీర్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌ హెచ్‌వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్‌ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది.

 ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 53 శాతం, ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. 

వీరికి డిమాండ్‌..  
డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ ఇంజనీర్, చార్టర్‌ అకౌంటెంట్, ఎస్‌ఈవో అనలిస్ట్, యూఎక్స్‌ డిజైనర్‌లకు డిమాండ్‌ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్‌ స్వల్పంగా పెరిగింది.  

వీటిపై దృష్టి పెట్టాలి.. 
ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్‌ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చైన్‌లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్‌ లెన్నింగ్‌ (ఏఐ), మెషిన్‌ లెన్నింగ్‌ (ఎంఎల్‌)లో పీజీ కోర్స్‌లకు డిమాండ్‌ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్‌–3గా ఉన్నాయి.   

మరిన్ని వార్తలు