వేతనాల పెంపునకు రంగం సిద్ధం.. అందులో హైదరాబాద్‌..

14 May, 2022 17:38 IST|Sakshi

వేతనాల పెంపు 8 శాతం

కరోనా ముందు నాటి స్థాయికి సవరణ 

టీమ్‌లీజ్‌ నివేదిక  

ముంబై: ఉద్యోగుల సగటు వేతనాల పెంపు ఈ ఏడాది 8.13 శాతంగా ఉండొచ్చని టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా వేసింది. కరోనా లాక్‌డౌన్‌ల నుంచి పరిస్థితులు కుదుటపడినట్టు పేర్కొంది. ‘జాబ్స్‌ అండ్‌ శాలరీ ప్రైమర్‌ రిపోర్ట్‌ 2021–22’ పేరుతో టీమ్‌లీజ్‌ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. గత రెండేళ్ల మాదిరిగా కాకుండా, అన్ని రంగాల్లోనూ ఎక్కువ విభాగాల్లో వేతనాల పెంపు ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఈ నివేదికలో భాగంగా 17 రంగాల్లోని పరిస్థితులను సమీక్షించింది. అన్నింటిలోనూ వేతనాల పెంపు ఒక అంకె స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. ‘‘వేతనాల పెంపు డబుల్‌ డిజిట్‌ను చేరుకోవాల్సి ఉంది.

గత రెండేళ్లలో చూసిన వేతనాల క్షీణత, స్తబ్ధత అన్నవి ముగింపునకు రావడం సంతోషకరం’’అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకురాలు రితూపర్ణ చక్రవర్తి తెలిపారు.త్వరలోనే ఇంక్రిమెంట్లు కరోనా ముందు నాటికి చేరుకుంటాయన్నారు. తొమ్మిది పట్టణాల్లోని 2,63,000 మంది ఉద్యోగులకు చేసిన వేతన చెల్లింపుల ఆధారంగా టీమ్‌లీజ్‌ ఈ నివేదికను రూపొందించడం గమనార్హం. కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొన్నట్టు రీతూపర్ణ తెలిపారు. ‘‘2020–21లో 17 రంగాలకు గాను ఐదు రంగాల్లోనే హాట్‌ జాబ్‌ రోల్స్‌ ఏర్పాటయ్యాయి. కానీ, 2021–22లో తొమ్మిది రంగాల్లో కట్టింగ్‌ ఎడ్జ్‌ (కొత్త తరహా రోల్స్‌) ఉద్యోగాలు ఏర్పాటు అయ్యాయి’’అని రీతూ పర్ణ చెప్పారు.  

ఇక్కడ అధికం..  
ఈ ఏడాది 12 శాతానికి పైగా వేతనాల పెంపును చేపట్టే వాటిల్లో హైదరాబాద్, ముంబై, పుణె, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌ పట్టణాలు ఉన్నాయి. ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, హెల్త్‌కేర్, అనుబంధ రంగాలు, ఐటీ, నాలెడ్జీ సర్వీసెస్‌ రంగాలు అధిక వేతన చెల్లింపులకు సముఖంగా ఉన్నాయి.  

చదవండి: టెక్‌ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే?
 

మరిన్ని వార్తలు