Microprocessor Chips: సొంత చిప్‌ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్‌ వరకే?

7 Sep, 2021 13:08 IST|Sakshi

యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, టెస్లా, బైడూ.. ఈ కంపెనీలకు ఏమైంది? ఒక పక్క చిప్‌ల కొరత, మరోపక్క సొంతంగా తయారు చేసుకుంటామని ప్రకటనలు. ఈ ప్రకటనలు ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు?..అమలయ్యేది ఎప్పుడు? పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి.. కొత్తగా డబ్బా కొడుతున్న టెక్‌ కంపెనీలు ఎందుకంత హడావిడి చేస్తున్నాయి. 
 

టెక్‌ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్‌ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్‌, యాపిల్‌లు ఈ రేసులో ముందున్నాయని, ‘గూగుల్‌బుక్‌ ల్యాప్‌ట్యాప్‌’ కోసం గూగుల్‌ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. కానీ, ఏ లెక్కన చూసినా ఈ ప్రొడక్ట్‌ మార్కెట్‌లోకి వచ్చేది 2023 చివరికే.   క్లిక్‌ చేయండి: ఫేస్‌ కాదు ఫేక్‌ బుక్‌

అయితే సొంత చిప్‌ తయారీ వ్యవహారం అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. తాజాగా టీఎస్‌ఎంసీ కంపెనీ తైవాన్‌లో అత్యాధునిక చిప్‌ల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు పది బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ఫ్యాక్టరీ.. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్‌ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పడం లేదు. ఈ లెక్కన టెక్‌ దిగ్గజాలేవీ ఇప్పటికిప్పుడే చిప్‌ తయారీలోకి స్వయంగా దిగే అవకాశాలేవని, ప్రకటనలన్నీ ఉత్త ప్రకటనలేనని అభిప్రాయపడుతున్నారు.
 

ఆగమేఘాల మీద ప్రకటనలు.. 
పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌, టీవీ, ఆటోమొబైల్స్‌ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల(సెమీ-కండక్టర్‌)ను ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్‌లో వీటికి హై డిమాండ్‌ ఉంది. అయితే కరోనా టైం నుంచి చిప్‌ షార్టేజీ మొదలైంది. చాలా వరకు కంపెనీలు బాగా నష్టపోయాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గి.. రేట్లు ఆకాశానికి అంటాయి. ప్రత్యేకించి కొన్ని బ్రాండ్‌లు ప్రొడక్టివిటీ ఉన్నా.. ఎక్కువ రేట్లకు అమ్మేస్తుండడంతో కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. అందుకే సొంతంగా చిప్‌ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. వరుసగా ఒక్కో కంపెనీలు చిప్‌ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి.  అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా అవతలి కంపెనీలను దిగొచ్చి చేసే స్రా‍్టటజీ కూడా అయ్యి ఉండొచ్చని టెక్‌ నిపుణులు చెప్తున్నారు.

 

సొంత ఆలోచన మంచిదే
ఒకవేళ కంపెనీలు నిజంగా సొంత చిప్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టినా.. అది మంచి ఆలోచనే అంటున్నారు ‘డైలాగ్‌ సెమీకండక్టర్‌’(యూకే) మాజీ బాస్‌ రస్‌ షా. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకేరకమైన చిప్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా తమ డివైజ్‌లకు తగ్గట్లుగా చిప్స్‌ తయారీ చేసుకోవాలనేది టెక్‌ కంపెనీల ఉద్దేశం. తద్వారా డివైజ్‌ల సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్‌ కూడా వాళ్ల నియంత్రణలో ఉంటుంది. పైగా చీప్‌గా వర్కవుట్‌ అయ్యే వ్యవహారమని, డివైజ్‌లకు అందే ఎనర్జీని కూడా తక్కువగా తీసుకుంటుందని, స్మార్ట్‌ ఫోన్‌లు అయినా.. క్లౌడ్‌ సర్వీసెస్‌లకైనా ఒకేలా పని చేస్తాయని రస్‌ షా చెబుతున్నారు.

 

పాత ప్రకటనలే!
సొంత చిప్‌ల ప్రకటనలు వరుసగా చేస్తున్న బడా కంపెనీలు.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రం ఇవ్వట్లేదు. నిజానికి నవంబర్‌ 2020లోనే యాపిల్‌.. ఇంటెల్‌ ఎక్స్‌86 తరహా సొంత ప్రాసెసర్‌ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ ప్రయత్నాలు అసలు మొదలుకాలేదు. ఇక టెస్లా ఏమో ఆరు నెలల కిందటే డేటా సెంటర్‌ల్లోని అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్స్‌ కోసం ‘డోజో’ చిప్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ క్లౌడ్‌ సర్వీసులు ఉన్న అమెజాన్‌.. నెట్‌వర్కింగ్‌ చిప్‌ను రూపొందించే పనిలో చాలాకాలం నుంచే ఉంది. ఫేస్‌బుక్‌ రెండేళ్ల క్రితమే అర్టిఫీషియల్‌ సొంత చిప్‌ ప్రకటన చేసింది. గూగుల్‌ కూడా సేమ్‌ ఇదే తీరు. ఒకవేళ నిజంగా వీళ్లు రంగంలోకి దిగినా.. డిజైనింగ్‌ వరకే పరిమితం అవుతారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా చిప్‌ తయారీ రంగంలోకి దిగే పరిస్థితులు లేవని కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేస్తే.. తడిసి మోపెడు అవ్వడం ఖాయమంటున్నారు.

చదవండి: అసలు చిప్‌లు ఏం చేస్తాయి? వివాదాలు ఎందుకంటే..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు