IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!

16 Nov, 2022 19:47 IST|Sakshi

నిన్న ట్విటర్‌..మెటా. నేడు అమెజాన్‌. సంస్థ ఏదైనా సందర్భం ఒక్కటే. అదే కాస్ట్‌ కట్‌. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో పాటు..ఆ రంగానికి అనుసంధానంగా ఉన్న ఇతర రంగాల్లో నడుస్తున్న చర్చ ఇది. డిజిటల్‌ అడ్వటైజ్మెంట్‌ నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సంస్థలు మీటింగ్‌ అని పిలిచి వేరే ఉద్యోగం చూసుకోమని చీటింగ్‌ చేయడం కొసమెరుపు  

ప్రపంచ దేశాల్లో కోవిడ్‌-19 సంక్షోభం కారణంగా డిజిటల్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. కూర్చున్న చోటు నుంచే కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకోవడంతో పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్ లైన్‌ క్లాసులు, ఓటీటీలు, యాప్స్‌, యూపీఐ పేమెంట్స్‌, సోషల్‌ మీడియా, ఈకామర్స్‌ సేవలు, ఆన్‌లైన్‌ సర్వీసులు ఇలా ఊహించని విధంగా డిజిటల్‌ కార్యకలాపాలు జోరందుకున్నాయి. మరి ఆ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగాలంటే ఐటీ రంగం, అందులో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. దీంతో టెక్‌ కంపెనీలు డిమాండ్‌కు మించి ఉద్యోగుల్ని నియమించున్నాయి. నాస్కామ్‌ నివేదిక ప్రకారం. ఒక్క భారత్‌లో 2021- 2022 ఆర్ధిక సంవత్సరంలో సుమారు నాలుగున్నర లక్షల మందికి పైగా కొత్తగా ఈ రంగంలో ఉపాధి పొందారు.

ఇక వారిని నిలుపుకునేందుకు దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు శాలరీల పెంపు, ప్రోత్సాహకాలు, ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు డబుల్‌ శాలరీలు, ఇన్సెంటీవ్స్‌లు, బోనస్‌లు ఇచ్చాయి. మహమ్మారి కారణంగా రియల్‌ ఎస్టేట్‌, అగ్రికల్చర్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఏవియేషన్‌ ఇలా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఒక్క ఐటీ రంగం ఎన్నడూ లేని విధంగా లాభాల్ని గడించింది. . 

కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్‌తో పాటు మిగిలిన దేశాలపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది.  భారత్‌కు చెందిన దిగ్గజ టెక్‌ కంపెనీలు 80శాతం ప్రాజెక్ట్‌లు అమెరికా, యూరప్‌ దేశాల మీద ఆధారపడ్డాయి. ఆ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కారణంగా వడ్డీ రేట్లు పెంచడం, ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు మెటా, ట్విటర్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

మెటా మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందిపై వేటు వేయగా, ట్విటర్‌ ప్రపంచ వ్యాప్తంగా  3,700 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ జారీ చేసింది. భారత్‌లో ట్విటర్‌ ఉద్యోగులు 200 మంది ఉండగా వారిలో 12 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రైప్‌, సేల్స్‌ ఫోర్స్‌, మైక్రోసాఫ్ట్‌, జిల్లో, స్నాప్‌,రాబిన్‌ హుడ్‌ వంటి సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.  

తాజాగా ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ వారంలో 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్‌ పేరుతో ఉద్యోగుల్ని పిలిపించి రెండు నెల‌ల్లోగా వేరే ఉద్యోగాలు చూసుకోవాల‌ని తెగేసి చెబుతున్న‌ట్టు స‌మాచారం. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్‌ పోస్టులు దర్శనమిస్తున్నాయి.అమెజాన్ అలెక్సా వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ బిజినెస్‌, క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్‌, కిండిల్ ఇలా 126 వంటి విభాగాల‌కు చెందిన ఉద్యోగులపై లేఆఫ్స్ ఎఫెక్ట్ అధికంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు.

పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఇతర కంపెనీలు లేఆఫ్స్‌కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చును తగ్గించుకునేందకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు