చిన్న నగరాల్లోకి టెక్‌ విస్తరణ - కొత్త హబ్‌లుగా 26 సిటీలు

31 Aug, 2023 07:24 IST|Sakshi

ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న నిపుణుల లభ్యత

నాస్కామ్, డెలాయిట్‌ నివేదిక 

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా హైదరాబాద్, బెంగళూరు వంటి ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన దేశీ టెక్నాలజీ రంగంలో క్రమంగా వికేంద్రీకరణ జరుగుతోంది. చిన్న నగరాలకూ పరిశ్రమ విస్తరిస్తోంది. చండీగఢ్, నాగ్‌పూర్, కాన్పూర్‌ వంటి 26 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11–15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండటం కూడా ఇందుకు కారణం. 

కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ కలిసి ’భారత్‌లో వర్ధమాన టెక్నాలజీ హబ్‌లు’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ పరిశ్రమలో 54 లక్షల మంది పైచిలుకు సిబ్బంది ఉండగా .. వీరిలో అత్యధిక శాతం ఉద్యోగులు ఏడు ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, పుణె) ఉంటున్నారు. 

‘టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్‌లో ఉన్నప్పటికీ .. కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా చెప్పుకోతగ్గ స్థాయిలో పని వికేంద్రీకరణ జరిగింది‘ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ సుమీత్‌ సల్వాన్‌ తెలిపారు. ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకునే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరింత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెక్నాలజీ హబ్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం పెరుగుతోందని నాస్కామ్‌ హెడ్‌ (జీసీసీ, బీపీఎం విభాగం) సుకన్య రాయ్‌ వివరించారు.  

వ్యయాల తగ్గుదల..
రాబోయే రోజుల్లో చండీగఢ్, కాన్పూర్, అహ్మదాబాద్, మంగళూరు, నాగ్‌పూర్‌ వంటి సిటీలు కొత్త తరం టెక్నాలజీ హబ్‌లుగా ఎదగగలవని నివేదిక తెలిపింది. కార్యకలాపాల నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటం, అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు, విధానాలపరంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలు ఇందుకు సానుకూలంగా ఉండనున్నాయి. 

ఈ తరహా పలు వర్ధమాన హబ్‌లలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, డబ్ల్యూఎన్‌ఎస్‌ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి వర్ధమాన నగరాల్లో 7,000 పైచిలుకు అంకుర సంస్థలు డీప్‌టెక్‌ మొదలుకుని బీపీఎం వరకు వివిధ టెక్‌ సేవలు అందిస్తున్నాయి. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఈ వర్ధమాన కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 

2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నాయి. ఇన్వెస్టర్లు కూ డా ప్రస్తుతం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోని అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది అంకుర సంస్థల్లోకి వచ్చిన నిధుల్లో 13 శాతం వాటా ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టార్టప్‌లకు దక్కడం ఇందుకు నిదర్శనం.

మరిన్ని వార్తలు