వర్చువల్‌ కార్యకలాపాలకు డిమాండ్‌

6 Mar, 2021 06:42 IST|Sakshi

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్‌ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య సాంకేతిక రంగంలో ఉద్యోగ నియామకం స్థిరంగా ఉందని గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ఇన్‌డీడ్‌ తెలిపింది. జనవరిలో దేశీయ టెక్‌ జాబ్స్‌ పోస్టింగ్‌ 13 శాతం మేర పెరిగాయని పేర్కొంది. రిమోట్‌ వర్కింగ్, టెక్నాలజీ ఆధారిత వ్యాపార కార్యకలాపాల అవసరం పెరగడం వంటి కారణాలతో టెక్‌ నియామకాలను పెంచుకోవాల్సి వచ్చిందని ఇన్‌డీడ్‌.కామ్‌ ఎండీ సాషి కుమార్‌ తెలిపారు. సమీప భవిష్యత్తులో డిజిటలైజేషన్, వర్చువల్‌ కార్యకలాపాలు మరింత వృద్ధి చెందుతాయని, దీంతో ఈ రంగాలలో టెక్‌ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి పది టెక్‌ ఉద్యోగాలలో అప్లికేషన్‌ డెవలపర్‌ జాబ్స్‌ ప్రథమ స్థానంలో ఉన్నాయని, ఆ తర్వాత ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్స్, సైట్‌ రిలయబులిటీ ఇంజనీర్, క్లౌడ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. గతేడాది ఏప్రిల్‌ – ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ డెవలపర్, ఎస్‌ఏపీ కన్సల్టెంట్, సీనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజనీర్, టెక్నికల్‌ కన్సల్టెంట్, ఆటోమేషన్‌ ఇంజనీర్‌ జాబ్స్‌ సానుకూల నమోదు కనిపించిందని తెలిపారు. టెక్‌ ఆధారిత ఉద్యోగాలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఈ–కామర్స్‌ కంపెనీలలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు