ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు

6 Mar, 2023 06:06 IST|Sakshi

టెక్‌ మహీంద్రా రూ. 700 కోట్లు కేటాయింపు

ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్‌ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌ బిజినెస్‌లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్‌రేట్‌ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు.

కాగా.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌ బిజినెస్‌ ద్వారా రెండేళ్లలో బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్‌ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్‌గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్‌ఎస్‌ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.  

ఈ వార్తల నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేరు బీఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది.

మరిన్ని వార్తలు