Tech Mahindra Q1 Results: టెక్‌ మహీంద్రా.. మార్జిన్లు తగ్గాయ్‌

26 Jul, 2022 08:20 IST|Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా నికర లాభం 16.4 శాతం క్షీణించి రూ. 1,132 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,353 కోట్లు. పలు అంశాల మూలంగా మార్జిన్లు తగ్గిపోవడమే తాజాగా లాభాల క్షీణతకు కారణం. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 24.6 శాతం వృద్ధి చెంది రూ. 10,198 కోట్ల నుంచి రూ. 12,708 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 15.2 శాతం నుంచి 11 శాతానికి తగ్గగా, నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరింది.

లాభదాయకతను పెంచుకునేందుకు అన్ని అవకాశాలూ వినియోగించుకుంటామని, రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో నమోదు చేయగలమని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌ కోణంలో కొన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు సరఫరా తరఫు సమస్యలు (అధిక వేతనాలతో ఉద్యోగులను తీసుకోవడం లేదా సబ్‌–కాంట్రాక్టుకు ఇవ్వడం వంటివి) కూడా మార్జిన్ల తగ్గుదలకు కారణమని తెలిపారు. 

ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. 
► క్యూ1లో 6,862 మంది ఉద్యోగుల నియామకాలతో సిబ్బంది సంఖ్య 1.58 లక్షలకు పెరిగింది.  
► అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) మార్చి త్రైమాసికంలో 24 శాతంగా ఉండగా, జూన్‌ క్వార్టర్‌లో 22 శాతానికి తగ్గింది. అయితే, గతేడాది క్యూ1లో నమోదైన 17 శాతంతో పోలిస్తే ఇంకా అధికంగానే ఉంది. 
► బీఎస్‌ఈలో టెక్‌ మహీంద్రా షేరు 1.15 శాతం క్షీణించి రూ. 1,016.55 వద్ద క్లోజయ్యింది. 

చదవండి: 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు

మరిన్ని వార్తలు