టెక్‌ మహీంద్రా లాభం 26% అప్‌..

26 Oct, 2021 06:28 IST|Sakshi

క్యూ2లో రూ. 1,339 కోట్లు

ఆదాయం 16 శాతం వృద్ధి, రూ. 10,881 కోట్లు

షేరుకు రూ. 15 ప్రత్యేక డివిడెండ్‌

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా నికర లాభం 26 శాతం ఎగిసింది. రూ. 1,339 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,065 కోట్లు. ఇక తాజా సమీక్షాకాలంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెంది రూ. 10,881 కోట్లుగా నమోదైంది. జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇది దశాబ్ద కాలంలోనే గరిష్ట వృద్ధి.

టెక్‌ మహీంద్రా షేరు ఒక్కింటికి రూ. 15 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది. క్యూ2లో కొత్తగా 750 మిలియన్‌ డాలర్ల డీల్స్‌ కుదిరాయని, వీటిలో సింహభాగం డిజిటలైజేషన్‌కి సంబంధించినవే ఉన్నాయని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా పనితీరు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 15.2 శాతంగా నమోదైన నిర్వహణ లాభాల మార్జిన్‌ను ఇకపైనా అదే స్థాయిలో లేదా అంతకు మించి సాధించే అవకాశాలు ఉన్నాయని గుర్నానీ చెప్పారు.  

రెండు సంస్థల కొనుగోలు ..
డిజిటల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ లోడ్‌స్టోన్‌తో పాటు మరో సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు టెక్‌ మహీంద్రా తెలిపింది. ఇందుకోసం సుమారు 105 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 789 కోట్లు) వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, బ్రిటన్‌కు చెందిన ఉయ్‌ మేక్‌ వెబ్‌సైట్స్‌ (డబ్ల్యూఎండబ్ల్యూ)ని 9.4 మిలియన్‌ పౌండ్లకు (సుమారు రూ. 97 కోట్లు) కొనుగోలు చేసినట్లు వివరించింది.

అట్రిషన్‌తో సమస్యలు..
నిపుణులకు డిమాండ్‌ నెలకొనడంతో అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) ఐటీ సంస్థలకు సమస్యాత్మకంగా తయారైందని గుర్నానీ తెలిపారు. అయితే, తమ సంస్థ దీన్ని ఎదుర్కొంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్‌ మహీంద్రాలో అట్రిషన్‌ రేటు తాజా క్యూ2లో 21 శాతానికి పెరిగింది. ఇది గత క్యూ2లో 14 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతానికి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పెద్ద నగరాల్లో అట్రిషన్‌ రేటు అధికంగా ఉండగా.. నాగ్‌పూర్, భువనేశ్వర్‌ వంటి ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉందని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ 14,000 మంది పైచిలుకు ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరినట్లు గుర్నానీ చెప్పారు.
సోమవారం బీఎస్‌ఈలో టెక్‌ మహీంద్రా షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,524 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు