టెక్‌ మహీంద్రా లాభం హైజంప్‌

27 Apr, 2021 04:16 IST|Sakshi

క్యూ4లో రూ.1,081 కోట్లు; 35 శాతం అప్‌

షేరుకి రూ. 30 డివిడెండ్‌ 1,21,054కు చేరిన మొత్తం సిబ్బంది సంఖ్య

కన్సల్టింగ్‌ సంస్థ ఎవెంటస్‌ సొల్యూషన్స్‌ కొనుగోలు

ఏప్రిల్‌ నుంచి జీతాల పెంపు

ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది.

ఆగస్ట్‌ 11న డివిడెండ్‌...
టెక్‌ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్‌ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్‌ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్‌ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్‌ కేర్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు.

బీపీఎస్‌లో పట్టు
కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్‌ కంపెనీ ఎవెంటస్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్‌ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీస్‌(బీపీఎస్‌) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది.  
ఫలితాల నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది.

అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్‌ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్‌ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్‌ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది.

– సీపీ గుర్నానీ, టెక్‌ మహీంద్రా సీఈవో

మరిన్ని వార్తలు