యూట్యూబ్‌ వీడియో లైక్‌ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్‌ చేస్తే!

15 May, 2023 16:40 IST|Sakshi

వాట్సాప్‌ స్కాం:  టెక్కీకిరూ. 42 లక్షలకు కుచ్చు టోపీ

న్యూఢిల్లీ:  ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే చాలు డబ్బులే డబ్బులు ఫేక్‌ మెసేజ్‌లతో సోషల్‌ మీడియా యూజర్లను నిండా ముంచుతున్న  కొత్త స్కాం కలకలం రేపేతోంది. కేవలం వీడియోలని లైక్‌ చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరమని వాట్సాప్‌ మెసేజ్‌ రావడంతో ఆశపడ్డ ఇంజనీర్‌కు భారీ షాక్‌ తగిలింది. ఒకటీ, రెండు కాదు ఏకంగా 45 లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి.మోసాన్ని ఆలస్యం గుర్తించిన అతగాడు పోలీసులను ఆశ్రయించడంతో  విషయం వెలుగులోకి వచ్చింది.

గుర్గావ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కేటుగాళ్లు దాదాపు రూ.42 లక్షల మేర  కుచ్చుటోపీ పెట్టారు.  మార్చి 24న అతనికి వాట్సాప్‌లో అతనికి ఒక మెసేజ్‌ వచ్చింది.  కేవలం కొన్ని యూట్యూబ్‌ వీడియోలను లైక్ చేస్తే చాలు భారీ ఆదాయం వస్తుందంటూ నమ్మబలికారు స్కామర్లు. అదనపు ఆదాయం వస్తుందని కదా టెక్కీ ఆశపడ్డాడు. ఆ తరువాత మెల్లిగాపెట్టుబడి పెట్టమని అడిగారు. దీనికి అంగీకరించడంతో  కేటుగాళ్లు తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు.

మొదట దివ్య అనే మహిళ  సదురు టెకీని టెలిగ్రామ్ యాప్‌లోని గ్రూప్‌లో చేర్చుకుంది.  దివ్యతో పాటు, కమల్, అంకిత్, భూమి, హర్ష్ అనే లాంటి కొంతమంది తాము రూ. 69 లక్షలకు పైగా భారీ లాభాన్ని ఆర్జించామని నమ్మ బలికారు. ఇక అంతే రెండో ఆలోచన లేకుండానే భార్య, తన బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.42,31,600 బదిలీ చేశాడు.  ఆ తరువాత నుంచి కనీస సొమ్మును  విత్‌డ్రా చేయకుండా అడ్డుకోవడమే కాకుండా, మరో  11 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరారు.  దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  టెకీ ఫిర్యాదుమేరకు సైబర్ క్రైమ్‌, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  (MG Comet EV: చీపెస్ట్‌ ఈవీ ‘ఎంజీ కామెట్‌’ వెయిటింగ్‌కు చెక్‌: బుకింగ్‌ ప్రైస్‌ తెలిస్తే!)

ఇలాంటి అనుమానాస్పద సందేశాలు సాధారణంగా "హాయ్, ఎలా ఉన్నావు?" తో  మొదలవుతాయి. ఇక్కడ టెంప్డ్‌ అయ్యామో..ఖేల్‌ ఖతం. ఉద్యోగం, అదనపు ఆదాయంఅంటూ ఊదర గొడతారు. అసలు మీరే మీ చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఇది పూర్తిగా ఉచితం. సింపుల్‌,  మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి, స్క్రీన్‌షాట్‌లు పంపడమే అంటారు. దీనికి  రూ.150 రూపాయలిస్తాం. ఇచ్చిన అన్ని టాస్క్‌లపై LIKE క్లిక్ చేస్తే రోజుకు 8000 రూపాయల వరకు సంపాదించవచ్చు. వెంటనే పేమెంట్‌. ఒక్కసారి ట్రై చేయండి అంటూ ముగ్గులోకి దించుతారు. ఆనక నిండా ముంచేస్తారు.ఇదీ స్కామర్ల లేటెస్ట్‌ మోడస్‌ ఆఫ్‌ ఓపరాండి  ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు   సూచిస్తున్నారు. (టీ స్టాల్‌ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు )

మరిన్ని వార్తలు