బ్యాంకింగ్‌ డిజిటలైజేషన్‌లో బాలారిష్టాలు

19 Jan, 2021 06:03 IST|Sakshi

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ నివేదిక  

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ డిజిటలైజేషన్‌ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. ‘రిటైల్‌ బ్యాంకింగ్‌లో సాంకేతిక పరమైన అవరోధాలు: పెద్ద బ్యాంకుల్లో మారాల్సిన పరిస్థితులు’’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► భారత్‌లో ప్రధానమైన డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థ– యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వినియోగం భారీగా పెరిగేందుకు కోవిడ్‌–19 ప్రేరిత అంశాలు దోహదపడుతున్నాయి. 2020 జూన్‌ నుంచి నవంబర్‌ మధ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ దాదాపు రెట్టింపయ్యింది.  

► మొబైల్‌ పేమెంట్‌ యూజర్లు ఈ–వాలెట్ల నుంచి యూపీఐ వైపునకు మారుతున్నారు. 2020 అక్టోబర్‌లో మొత్తం పేమెంట్స్‌ మార్కెట్‌ లావాదేవీల్లో యూపీఐ వాటా 51 శాతం కావడం గమనార్హం.  

► ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, ఇంటర్‌నెట్‌ కనెక్టివిటిలో పురోగతి, సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడే యువత అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు దోహదపడతాయి.  

► బ్యాంకింగ్‌లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.  

► అయితే మొండిబకాయిల భారం, తక్కువ లాభదాయకత వంటి అంశాలు సాంకేతికతపై బ్యాంకింగ్‌ వ్యయాలను క్లిష్టతరం చేస్తున్నాయి. కాగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)సహా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు, కొన్ని బ్యాంకింగ్‌–యేతర ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) బ్యాంకింగ్‌ విషయంలో సాంకేతిక అవరోధాలను విజవంతంగా అధిగమించగలుగుతున్నాయి. అలాగే పలు ఫైనాన్షియల్‌ సంస్థలు కస్టమర్లకు సంబంధించి పలు సేవల విషయంలో ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) వినియోగాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాయి.  

► సాంప్రదాయక బ్యాంకులు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకులు తమ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేసుకోడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి.

మరిన్ని వార్తలు