ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్‌ జోడీ 

25 Aug, 2021 04:12 IST|Sakshi
కొత్త లోగోను ఆవిష్కరిస్తున్న రాజ్యసభ ఎంపీ, రామ్‌కీ గ్రూప్‌ ఫౌండర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ రెడ్డి (కుడి) 

సూపర్‌ ప్రీమియం విభాగంలోకి ఎంట్రీ 

కొత్త ప్లాంటుకు రూ.75 కోట్ల వ్యయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్‌ ప్రీమియం పెయింట్ల తయారీలోకి  అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్‌ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.  

నూతన తయారీ కేంద్రంలో..
కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్‌ పటాన్‌చెరు సమీపంలోని చేర్యాల్‌ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్‌ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్‌ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్‌ పెయింట్స్, స్పెషల్‌ టెక్స్చర్‌ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్‌ ఫినిషెస్‌ తయారు చేస్తారు.  

ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. 
టెక్నో పెయింట్స్‌ ఆగస్ట్‌ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్‌ బుక్‌ రూ.600 కోట్లుంది. హైదరాబాద్‌లో పెయింటింగ్‌ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్‌ 2021–22లో టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 

>
మరిన్ని వార్తలు