stockmarket : ఇకపైనా టెక్‌ కంపెనీల ఐపీవోల జోరు

18 Sep, 2021 09:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల పబ్లిక్‌ ఇష్యూల బాట పట్టిన వృద్ధి ఆధారిత టెక్‌ కంపెనీలు ఇకపైనా మరింత జోరు చూపనున్నట్లు అజయ్‌ త్యాగి పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఐపీవోల ద్వారా ఈ సంస్థలు రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ త్యాగి తెలియజేశారు. 

ఈ బాటలో ఇకపైన మరో రూ. 30,000 కోట్లు సమకూర్చుకునేందుకు వృద్ధి ఆధారిత టెక్‌ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాఖలైన ప్రాస్పెక్టస్‌లు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టార్టప్‌ వ్యవస్థలో యూనికార్న్‌లుగా ఆవిర్భవిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. బిలియన్‌  డాలర్‌(సుమారు రూ. 7,400 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. 

దేశ ఆర్థిక వ్యవస్థలో పుట్టుకొస్తున్న కొత్త తరం టెక్‌ కంపెనీలు స్టార్టప్‌ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీలు ప్రత్యేకతలు కలిగిన బిజినెస్‌ మోడళ్లపై దృష్టిపెడుతున్నాయని చెప్పారు. వెనువెంటనే లాభాలు అందుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేగవంత వృద్ధిని అందుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. పారిశ్రామిక సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో స్టార్టప్‌లకు సంబంధించి త్యాగి పలు విషయాలను ప్రస్తావించారు. 

ఈక్విటీకి దన్ను 
ఇటీవల విజయవంతమైన పబ్లిక్‌ ఆఫరింగ్స్‌కుతోడు మరిన్ని కంపెనీలు లిస్టింగ్‌ బాటలో సాగనుండటంతో ఈక్విటీ మార్కెట్లు మరింత విస్తరించే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. టెక్‌ స్టార్టప్‌ల నుంచి తొలిసారిగా జొమాటో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి సక్సెస్‌ సాధించిన విషయం విదితమే.

జొమాటో లిస్టింగ్‌తో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు అనేకం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో పేటీఎమ్, పాలసీబజార్, మొబిక్విక్, నైకా తదితరాలున్నాయి. కొద్ది కాలంగా ఐపీవో మార్కెట్లో బూమ్‌ నెలకొన్నట్లు త్యాగి పేర్కొన్నారు. దీంతో 2020–21లో ప్రైమరీ మార్కెట్‌ ద్వారా రూ. 46,000 కోట్ల పెట్టుబడులు సమకూరిన విషయాన్ని ప్రస్తావించారు.

అంతక్రితం ఏడాది సమీకరించిన రూ. 21,000 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) ఈ స్పీడ్‌ మరింత పెరగనుంది. తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్‌–ఆగస్ట్‌)నే దాదాపు గతేడాది సమీకరించిన నిధులను అందుకోవడం గమనార్హం! వెరసి ప్రైమరీ మార్కెట్‌ చరిత్రలో అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్న ఏడాదిగా 2022 నిలిచే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు.  

మరింత పెరగాలి..  
ఐపీవోలకు నిర్ణయించే ధరల శ్రేణి అంశంలో సంస్కరణలు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు త్యాగి వెల్లడించారు. ప్రస్తుతం ఐపీవో మార్కెట్‌ ధర నిర్ణయంలో సెకండరీ మార్కెట్‌తోపోలిస్తే పారదర్శకత తక్కువేనని వ్యాఖ్యానించారు. భారీగా దాఖలయ్యే ఈ డాక్యుమెంట్లలో పలు టెక్నికల్‌ అంశాల ప్రస్తావన ఉంటుందని, రిటైల్‌ ఇన్వెస్టర్లు వీటిని చదివి, అర్ధం చేసుకోవడం సవాలేనన్నారు.

చదవండి: జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో

>
మరిన్ని వార్తలు