తెలంగాణలో మరో ప్రయోగం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌

27 Dec, 2021 10:38 IST|Sakshi

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టణాలకే పరిమితం చేయకుండా పంట పొలాల్లోని ఉత్పత్తులకు ఉపయోగపడేలా కొత్త విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నగరానికి చెందిన నెబ్యూలా అనే సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా ఏఐని ఉపయోగించనున్నారు. 

ధాన్యాన్ని నలిపేసి
ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం అంతా మాన్యువల్‌ పద్దతిలోనే జరుగుతుంది. కొనుగోలు అధికారులు మార్కెట్‌లో రైతుల పండించిన ధాన్యాన్ని చేతిలో తీసుకుని నలపడం ద్వారా అందులో తేమ ఎంత ఉంది. చిన్న సైజువా పెద్ద సైజువా ఇలా అనేక అంశాలను బేరీజు వేసి తుది నిర్ణయానికి వస్తున్నారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని అనుసరించి ధాన్యానికి రేటు నిర్థారణ జరుగుతుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేదనే విమర్శలతో పాటు వేగం కూడా తక్కువగా ఉంది.

ఏఐ సాయంతో
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ విధానంలో శాంపిల్‌ ధాన్యాన్ని ట్రేలో పోసిన తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మెషిన్‌ ఆ ధాన్యాన్ని పరిశీలిస్తూ 360 డిగ్రీస్‌లో ఫోటోలు తీస్తుంది. అనంతరం ఆ సమాచారన్ని విశ్లేషించి. సదరు ధాన్యంలో ఎంత మోతాదు తేమ ఉంది. పరిణామం, వ్యాకోచం వంటి వివరాలతో పాటు ఆ పంట ఆర్గానిక్‌ లేదా రసాయనాలు ఉపయోగించి పండించినదా అనే వివరాలను క్షణాల్లో తెలియజేస్తుంది. ఈ విధానంలో వేగం పెరగడంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ముందుగా ఇక్కడే
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏఐ వినియోగాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా మూడు కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నారాయణపేట, కామరెడ్డిలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపిక కాగా మరొకదాన్ని ఫైనల్‌ చేయాల్సి ఉంది. ఈ కొనుగోలు కేంద్రాల్లో కంది, శనగ, వరి ధాన్యాల  కొనుగోలు సందర్భంగా ఏఐని వినియోగించాలని నిర్ణయించారు. 

మిగిలిన వాటికి 
పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేవలం ధాన్యం కొనుగోలుకే కాకుండా పండ్లు ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు లోనూ ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ వినియోగం పెంచాలనే యోచనలో ఉంది.

చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వాహనం

మరిన్ని వార్తలు