ఇండియాకి వస్తే మా తెలంగాణకి రండి? ఎలన్‌ మస్క్‌కి కేటీఆర్‌ ఆహ్వానం!

15 Jan, 2022 12:24 IST|Sakshi

ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో నిరంతరంగా ప్రయత్నించే మినిస్టర్‌ కేటీఆర్‌ మరోసారి దూకుడు ప్రదర్శించారు. చిక్కుముళ్లు ఎదురుగా ఉన్నా అవన్ని పక్కన పెట్టి ఏకంగా టెస్లా కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఎలన్‌మస్క్‌తో టచ్‌లోకి వెళ్లారు.

2016లో మొదలు
గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపి చూశారు కేటీఆర్‌. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్‌ ఎక్స్‌ కారుని అమెరికాలో నడిపారు. కారు బాగుందని తెలుపుతూ కొత్తగా ఆలోచించిన ఎలన్‌మస్క్‌కి ట్విట​‍్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా తాజాగా పాత ట్వీట్‌ని రీట్వీట్‌ చేశారు కేటీఆర్‌. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచేలా మరో ట్వీట్‌ చేశారు.

పని చేయలని ఉంది
ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్‌, కామర్స్‌ మంత్రిగా తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి చెందిన వ్యాపార సంస్థలు అనేక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటూ ట్వీట్‌ చేశారు. 

వస్తాం.. కానీ
తెలంగాణకు టెస్లా వస్తే సంతోషిస్తామంటూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై ఎలన్‌ మస్క్‌ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, ఇంకా అనేక అంశాలపై చర్చలు కొలిక్కి రాలేదంటూ ఎలన్‌మస్క్‌ బదులిచ్చారు. 

ఎప్పుడొస్తుంది
గత రెండేళ్లుగా టెస్లా కార్లను ఇండియాకి తెస్తామంటూ ఎలన్‌ మస్క్‌ ప్రకటిస్తున్నారు. అయితే పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్‌ కార్లు ఐనందున దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. ఇండియాలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పన్ను రాయితీలపై సానుకూలంగా స్పందిస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిపై ఇటు టెస్లా, అటు కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో టెస్లా కనుక ఇండియాకి వస్తే తెలంగాణలో ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ ఏకంగా టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌ని అడగడం ద్వారా మంత్రి కేటీఆర్‌ చొరవ చూపించారు.    

చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..!

మరిన్ని వార్తలు