Hyderabad: ట్రెండ్‌ మారింది.. ఒక్కసారిగా ఆ గృహాలకు డిమాండ్‌

23 Jul, 2022 17:27 IST|Sakshi

గత నెలలో 5,408 రిజిస్ట్రేషన్లు 

ఇందులో 53 శాతం ఈడి తరహా ఇళ్లే 

నైట్‌ఫ్రాంక్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. కరోనా కంటే ముందు తక్కువ విస్తీర్ణం ఉండే అందుబాటు గృహాలను కొనుగోలు చేసేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి భౌతిక దూరం తప్పనిసరి కావటంతో ఇంటి విస్తీర్ణం పెరిగింది. దీంతో చవక గృహాల నుంచి మధ్య తరహా ఇళ్ల వైపు దృష్టిసారించారు. ఫలితంగా రూ.25–50 లక్షల మధ్య ధర ఉండే గృహాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. గ్రేటర్‌లో గత నెలలో రూ.2,841 కోట్ల విలువ చేసే 5,408 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇందులో 53% ఈ తరహా ఇళ్లే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. 

25 శాతం క్షీణత: గతేడాది జూన్‌లో జరిగిన  7,251 రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూన్‌ నాటికి 25 శాతం తగ్గుదల కనిపించింది. త్రైమాసికాల వారీగా గమనిస్తే.. ఈ ఏడాది జనవరి – మార్చి (క్యూ1)లో రూ.9,230 కోట్ల విలువ చేసే 21,488 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్యూ2 నాటికి రూ.8,685 కోట్ల విలువ చేసే 17,074 ప్రాపర్టీలు రిజిస్ట్రేషనయ్యాయి. రూ.25 లక్షల లోపు ధర ఉన్న సామాన్య గృహాలకు డిమాండ్‌ క్రమంగా తగ్గిపోతుంది. గతేడాది జూన్‌లో వీటి వాటా 40 శాతంగా ఉండగా.. ఈ జూన్‌ నాటికి 16 శాతానికి క్షీణించింది. ఇక గతేడాది జూన్‌లో మధ్య తరహా ఇళ్ల వాటా 35 శాతంగా ఉంది. 

81 శాతం గృహాల వాటా వీటిదే: రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాలకు 2021 జూన్‌లో 25 శాతం ఉండగా.. గత నెలలో 32 శాతానికి పెరిగింది. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాలకు గతేడాది జూన్‌లో 7 శాతం వాటా ఉండగా.. ఇప్పుడవి 9 శాతానికి పెరిగింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 81 శాతం ప్రాపర్టీలు 2 వేల చ.అ. లోపు విస్తీర్ణం ఉన్నవే. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్నవి 9 శాతం, 3 వేల కంటే ఎక్కువ ఉన్నవి 2 శాతం ప్రాపర్టీలున్నాయి. 

చదవండి: Yamaha Rx 100: ఎన్ని ఉన్నా ఈ బైక్‌ క్రేజ్‌ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్‌ మళ్లీ వస్తోంది!

మరిన్ని వార్తలు