4జీ చార్జీలకే 5జీ సేవలు!

23 Aug, 2022 05:12 IST|Sakshi

ప్రయోగాత్మకంగా కొనసాగింపు

దశలవారీగా రేట్లకు రెక్కలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అయిన 5జీ సేవలను నేడో రేపో ప్రారంభించేందుకు భారత టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. అయితే అందరి చూపూ చార్జీలు ఎలా ఉండబోతున్నాయనే. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కస్టమర్‌ నుంచి సమకూరే ఆదాయాన్ని పెంచుకోవాలని కొన్నేళ్లుగా టెలికం సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఈ సంస్థలు అందుకు తగ్గ ప్రణాళికనూ రెడీ చేసుకున్నాయి.  

ఆరు నెలల తర్వాతే..
ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్‌ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్‌ ఉంది. నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది.

నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్‌ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్‌–డిసెంబర్‌లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి.  

కంపెనీలకు స్పెక్ట్రం భారం..  
టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్‌ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్‌ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో కవరేజ్‌ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్‌ టెలికం సంస్థలు నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఓ కన్సల్టింగ్‌ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన.

రెండేళ్లలో 15 కోట్లు..
ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్‌సెట్స్‌ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్‌ తయారీ సంస్థలతో కలిసి బండిల్‌ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది. మూడు కంపెనీల గట్టి పోటీతో 5జీలోనూ అదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు