త్వరలో 5జీ నెట్‌వర్క్‌.. అందుబాటులో ఎప్పుడంటే?

26 Oct, 2021 08:42 IST|Sakshi

ట్రయిల్స్‌ గడువు పెంచాలంటూ టెల్కోల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్‌వర్క్‌ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్‌ కంపెనీలో​ ఎడాపెడా 5జీ హ్యాండ్‌సెట్లను రిలీజ్‌ చేస్తూ మార్కెట్‌లో హడావుడి చేస్తున్నాయి.

నవంబరులోపే
5జీ ట్రయల్స్‌ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, ఎంఎన్‌టీఎల్‌లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్‌ పూర్తి చేయాల్సి ఉంది. 

గడువు పెంచండి
నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్‌ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.

కారణం అదేనా
5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్‌సన్‌, నోకియా, శామ్‌సంగ్‌, సీ డాట్‌ తదితర ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్‌ చేయలేని పరిస్థితి నెలకొంది. 

వచ్చే ఏడాది
టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్‌ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్‌–జూన్‌ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్‌ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్‌ స్పీడ్‌ 3.7 గిగాబైట్‌ పర్‌ సెకండ్‌గా రికార్డు అయ్యింది.

చదవండి:ఏజీఆర్‌ లెక్కింపుపై టెల్కోలకు ఊరట

మరిన్ని వార్తలు