టెల్కోలు, వైఫై సంస్థలు జట్టు కట్టాలి

22 Jun, 2022 06:30 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా కొత్త వ్యాపార విధానాలను అమలు చేసేందుకు టెల్కోలు, వైఫై సంస్థలు కలిసి పని చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాట్‌ చైర్మన్‌ పి.డి. వాఘేలా సూచించారు. మొబైల్, వైఫై సాంకేతికతల సామర్థ్యాలను వెలికితీయాలని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం (బీఐఎఫ్‌) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా వినియోగం అనేక రెట్లు పెరుగుతుందని వాఘేలా చెప్పారు. ‘5జీ బ్రాడ్‌కాస్ట్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ల మధ్య కమ్యూనికేషన్, రోబోటిక్స్‌ మొదలైన టెక్నాలజీలతో డేటా వినియోగం భారీగా పెరుగుతుంది‘ అని తెలిపారు.

ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులో ఉన్న దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు 4జీతో పోలిస్తే 1.7–2.7 రెట్లు ఎక్కువగా మొబైల్‌ డేటా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వాఘేలా వివరించారు. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని పెంచేందుకు పబ్లిక్‌ వైఫై కూడా ఎంతగానో ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 2022 నాటికి 1 కోటి పబ్లిక్‌ వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని 2018 నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీలో నిర్దేశించుకున్నట్లు వాఘేలా చెప్పారు. భవిష్యత్తులో వైఫై7 కూడా రాబోతోందని, దీనితో డేటా డౌన్‌లోడ్‌ వేగం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు