ధరల తగ్గింపుపై టెలికాం సంస్థల అసంతృప్తి... ట్రాయ్ వివరణ..!

13 Apr, 2022 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పెక్ట్రం ధరల తగ్గింపు ఆశించిన స్థాయిలో లేదంటూ టెల్కోలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌.. తన సిఫార్సులను సమర్థ్ధించుకుంది. శాస్త్రీయంగా లెక్కించి, హేతుబద్ధమైన చార్జీలనే సిఫార్సు చేశామని ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా చెప్పారు. 5జీ మార్కెట్‌లో భారీ అవకాశాలు ఉన్నందున.. స్పెక్ట్రం వేలంలో టెలికం సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సిఫార్సు చేసిన రిజర్వ్‌ ధరలు .. బిడ్డర్లకు ఆకర్షణీయంగా ఉండగలవని భావిస్తున్నట్లు వాఘేలా తెలిపారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, పరిశ్రమ వర్గాల నుంచి విస్తృతంగా సేకరించిన అభిప్రాయాలు, దేశీయంగా 5జీ విస్తృతికి గణనీయంగా అవకాశాలు ఉండటం తదితర అంశాలే ట్రాయ్‌ ప్రస్తుత నిర్ణయానికి ప్రాతిపదికలని ఆయన వివరించారు. 

‘ఆకర్షణీయమైన ధర, సరళతర చెల్లింపు ఆప్షన్లు, సులభతరంగా సరెండర్‌ చేసే నిబంధనలు, లీజింగ్‌ విషయంలో చేసిన సిఫార్సులు మొదలైన వాటితో త్వరలో నిర్వహించబోయే వేలం.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది‘ అని వాఘేలా తెలిపారు. 30 ఏళ్ల వ్యవధికి కేటాయించే స్పెక్ట్రం కనీస ధరలను దాదాపు 39% తగ్గిస్తూ .. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల మెగా వేలానికి ట్రాయ్‌ సిఫార్సు చేసింది.

మరిన్ని వార్తలు