మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

17 Feb, 2021 15:52 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే రోజుల్లో ఇంటర్‌నెట్, ఫోన్ కాల్స్ ధరలు భారీగా పెరగనున్నాయా అంటే? అవుననే సమాధానం టెలికామ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది. జియో రాకతో టెలికామ్ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో కంపెనీలు డేటా ధరలతో పాటు ఫోన్ కాల్స్ ధరలను కూడా బాగా తగ్గేంచేశాయి. అయితే వచ్చే ఏప్రిల్ 1 నుంచి టెలికాం కంపెనీలు రేట్లు పెంచడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసిఆర్ఎ) నివేదిక ప్రకారం.. రాబోయే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సుంకాలను మరోసారి పెంచవచ్చు అని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు ఎంత పెరుగుతాయనే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుతం ఉన్న 2జీ వినియోగదారులను 4జీకి మార్చడంతో పాటు ఇంటర్‌నెట్, ఫోన్ కాల్స్ ధరలు పెంచడం ద్వారా సగటు వినియోగదారుడు వెచ్చించే ఆదాయాన్ని(ఎఆర్‌పియు) మెరుగుపర్చుకోవాలని కంపెనీలు చూస్తున్నట్లు ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. దీనివల్ల టెలికామ్ కంపెనీల ఆదాయం రాబోయే 2 సంవత్సరాల్లో 11శాతం నుంచి 13శాతంకు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి టెలికాం పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, విద్యార్థుల ఆన్‌లైన్ తరగతుల కారణంగా ఇంటర్‌నెట్, ఫోన్ కాల్స్ వినియోగం పెరిగింది. చివరగా టెలికాం కంపెనీలు 2019 డిసెంబర్‌లో టారిఫ్ రేట్లను పెంచాయి. టెలికాం కంపెనీల టారిఫ్ ధరలు పెరగనున్నాయనే వస్తున్నా వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

చదవండి:

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్

అమ్మకాల సెగ : 52 వేల దిగువకు సెన్సెక్స్‌

మరిన్ని వార్తలు