బ్రేకింగ్: 5జీ ట్రయల్స్ కు కేంద్రం ఆమోదం

4 May, 2021 18:43 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్పి)కు టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) మంగళవారం ఆమోదం తెలిపింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ లలో భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, ఎమ్‌టిఎన్‌ఎల్ ఉన్నాయి. ఈ టీఎస్పిలు ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే, రిలయన్స్ జియోఇన్‌ఫోకామ్ లిమిటెడ్ కూడా సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. 

మిడ్-బ్యాండ్ (3.2 GHz నుంచి 3.67 GHz), మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (24.25 GHz నుంచి 28.5 GHz) మరియు సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్ (700 GHz) వంటి వివిధ బ్యాండ్లలో ట్రయల్స్ నిర్వహించడానికి డీఓటీ ఆమోదం తెలిపింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి టీఎస్పిలకు వారి స్వంత స్పెక్ట్రం 800 MHz, 900 MHz, 1800 MHz, 2500 MHz 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి  కూడా కేంద్రం అనుమతించింది. 5జీ ట్రయల్స్ పట్టణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా పల్లె ప్రాంతాలలో కూడా పరీక్షలు నిర్వహించవచ్చు. 5జీ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. 

దేశీయంగా అభివృద్ది చేసిన 5జీ టెక్నాలజీని ట్రయల్స్ నిర్వహించడానికి డీఓటీ ప్రోత్సహిస్తుంది. దేశీయంగా 5జీ టెక్నాలజీని ఐఐటి మద్రాస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ(సిఇవిఐటి), ఐఐటి హైదరాబాద్‌లు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల టెలిమెడిసిన్, టెలీడ్యూకేషన్, ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్స్ వంటి రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ టెక్నాలజీ డేటా డౌన్‌లోడ్ వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్‌ఫోన్‌కే పరిమితం కాకుండా అన్ని రంగాలలో విప్లవాన్ని సృష్టించనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

చదవండి:

SBI: ఎస్​బీఐ ఖాతాదారులకు మరో గుడ్​న్యూస్

మరిన్ని వార్తలు