దేశీయంగా తయారీకి భారీ ప్రోత్సాహం

18 Feb, 2021 14:45 IST|Sakshi

పీఎల్‌ఐ పథకం కింద ఐదేళ్ల కాలంలో రాయితీలు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం 

టెలికం తయారీకి రూ.12,195 కోట్లు 

త్వరలో ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌లకూ..

న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ) కింద టెలికం గేర్ల తయారీకి రూ.12,195 కోట్ల రాయితీలను ఐదేళ్ల కాలంలో ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ‘‘దీంతో వచ్చే ఐదేళ్లలో దేశంలో రూ.2.44 లక్షల కోట్ల మేర టెలికం పరికరాల తయారీ సాధ్యపడుతుంది. ఇందులో రూ.1,95,360 కోట్ల మేర ఎగుమతులు ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశానికి పన్నుల రూపేణా రూ.17,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది’’ అని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి టెలికం గేర్ల తయారీకి పీఎల్‌ఐ పథకం అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.3,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.  

‘‘టెలికం రంగానికి పీఎల్‌ఐ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టెలికం ఎక్విప్‌మెంట్‌ విభాగంలో భారత్‌లో తయారీ ఊపందుకుంటుంది. 5జీ ఎక్విప్‌మెంట్‌ కూడా రానుంది. కనుక ప్రోత్సాహకాలు ఇవ్వడం అన్నది కీలక నిర్ణయం అవుతుంది. భాగస్వాములతో ఇప్పటికే విస్తృతమైన సంప్రదింపులు చేశాము’’ అని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. రూ.50వేల కోట్లకు పైగా టెలికం ఉపకరణాల దిగుమతులకు పీఎల్‌ఐ పథకం చెక్‌ పెడుతుందని.. భారత తయారీ ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌కు, ఎగుమతి మార్కెట్లకు అందించడం సాధ్యపడుతుందని ప్రభుత్వం సైతం ఓ ప్రకటన విడుదల చేసింది.   

4 నుంచి 7 శాతం రాయితీలు 
టెలికం ఉపకరణాల తయారీపై 4 శాతం నుంచి 7 శాతం వరకు అమ్మకాల్లో రాయితీలను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద రాయితీలకు ఎంఎస్‌ఎంఈలు అయితే కనీసం 10 కోట్లు, ఇతరులకు రూ.100 కోట్ల పెట్టుబడుల నిబంధన అమలు చేయనున్నారు. ల్యాప్టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలకు సంబంధించి త్వరలోనే పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. దేశంలో 2014 నాటికి ఎల్రక్టానిక్స్‌ తయారీ విలువ రూ.1.9 లక్షల కోట్లుగా ఉంటే, 2019–20 నాటికి రూ.5.5 లక్షల కోట్లకు చేరుకున్నట్టు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు