కోవిడ్‌–19 వ్యాప్తికి 5జీ కారణమంటున్న వార్తల్లో నిజమెంత?

19 May, 2021 00:19 IST|Sakshi

సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలను తొలగించేలా చూడండి 

కేంద్రానికి టెల్కోల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాప్తికి, 5జీ సర్వీసులకు ముడిపెడుతూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖను (ఎంఈఐటీవై) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్‌ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ ఇలాంటి తప్పుదోవ పట్టించే మెసేజీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్‌కు మే 15న సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ ఈ మేరకు లేఖ రాశారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఇలా తప్పుదోవ పట్టించే పోస్టులను సత్వరం తొలగించాలంటూ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సూచించండి‘ అని కోరారు.

భారత్‌లో ఇంకా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనప్పటికీ.. కోవిడ్‌ కేసుల పెరుగుదలకు 5జీ టవర్లే కారణమన్న ఆడియో, వీడియో మెసేజీలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్, బీహార్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇలాంటి తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని కొచర్‌ పేర్కొన్నారు. ఇలాంటి అపోహలను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రయోజనాలతో పాటు టెలికం కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వైరస్‌ ఉధృతి కారణంగా చాలా మటుకు కార్యకలాపాల నిర్వహణకు టెలికం, ఇంటర్నెట్‌పై ప్రజలు, ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో దుష్ప్రచారంతో టెలికం సేవలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు